
జెడ్ కేటగిరీ ఉపసంహరించలేదు
జగన్ భద్రతపై హైకోర్టులో ఏపీ ఏజీ
ఏజీ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన న్యాయమూర్తి
హోంశాఖ అధికారులకు నోటీసులు
విచారణ 2 వారాలకు వాయిదా
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డికి జెడ్ కేటగిరీ భద్రతను ఉపసంహరించలేదని ఏపీ అడ్వొకేట్ జనరల్(ఏజీ) పి.వేణుగోపాల్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. ఏజీ చెప్పిన విషయాన్ని రికార్డ్ చేసిన న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు, హోంశాఖ అధికారుల కు నోటీసులు జారీ చేస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. మూడేళ్లుగా తనకు ఉన్న జెడ్ కేటగిరీ భద్రతను తొలగించి, (1+1) వ్యక్తిగత భద్రత సిబ్బంది, (1+1) ముఖ్య భద్రతాధికారిని మాత్రమే కేటాయించడాన్ని సవాలు చేస్తూ వైఎస్ జగన్ సోమవారం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని మంగళవారం జస్టిస్ రామ్మోహనరావు విచారించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది డి.వి.సీతారామ్మూర్తి వాదనలు వినిపిస్తూ జగన్‌కు ప్రాణహాని ఉందన్న నిఘావర్గాల నివేదికలతో మూడేళ్ల నుంచి (6+6) వ్యక్తిగత భద్ర తాసిబ్బంది, (1+1) ముఖ్య భద్రతాధికారులతో జెడ్ కేటగిరీ భద్రత కొనసాగిస్తూ వస్తున్నారని, ఎ టువంటి నోటీసు ఇవ్వకుండా భద్రతను ఉపసంహరించారని తెలిపారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ భద్రత తొలగింపునకు సంబంధించిన ఉత్తర్వులను చూపాలని కోరారు. అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదని, ఈ నెల 13 నుంచి జెడ్ కేటగిరీ భద్రత సిబ్బంది రావడం మానేశారని సీతారామ్మూర్తి కోర్టు దృష్టికి తెచ్చారు.
ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ వేణుగోపాల్ జోక్యం చేసుకుంటూ జగన్‌కు జెడ్ కేటగిరీ భద్రతను తొలగిం చలేదని చెప్పారు. ఏజీ ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసుకున్న న్యాయమూర్తి, ప్రతివాదులుగా ఉన్న హోంశాఖ అధికారులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 2 వారాలకు వాయిదా వేశా రు. కాగా కుదించిన తన భద్రతను యథాతథం గా పునరుద్దరించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇ వ్వాలన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రాణహాని ఉన్న వ్యక్తుల జాబితాలో సుబ్బారెడ్డి పేరు లేదని, అందువల్లే ఆయనకు భద్రతను కుదించామన్న ఏజీ వాదనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి రామ్మోహనరావు, విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు.