మోపిదేవి బెయిల్ పిటిషన్ తిరస్కరణ
హైదరాబాద్ : వాన్ పిక్ కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ మధ్యంతర బెయిల్ పిటిషన్ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. ఆయనకు జైలులోనే మెరుగైన చికిత్స అందించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. వెన్నునొప్పి దృష్ట్యా శస్త్రచికిత్స చేయించుకునేందుకు వీలుగా 3 నెలలపాటు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలంటూ మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మోపిదేవి పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి దుర్గాప్రసాద్‌రావు శనివారం విచారించారు.
మోపిదేవి ఎస్కార్టు మధ్య ఆసుపత్రిలో చేర్చి శస్త్రచికిత్స చేయించేందుకు అభ్యంతరం లేదని, అందుకు తాత్కాలిక బెయిల్ ఇవ్వనక్కర్లేదని సీబీఐ వాదించగా, వీలైనంత త్వరగా మోపిదేవికి శస్త్రచికిత్స చేయాలని ఉస్మానియా వైద్యుల మెడికల్ బోర్డు నిర్ధారించిందని మోపిదేవి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు
మోపిదేవికి మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.