సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో వాన్‌పిక్ పెట్టుబడులకు సంబంధించిన కేసులో నిందితునిగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు వెన్నునొప్పికి చికిత్స చేయించుకునేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. సోమవారం షరతులతో కూడిన 45 రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం నుంచి అక్టోబరు 31 వరకు ఆయన బెయిల్‌పై ఉంటూ చికిత్స పొందవచ్చని, నవంబర్ 1న తిరిగి ప్రత్యేక కోర్టులో లొంగిపోవాలని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.
దుర్గాప్రసాద్‌రావు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రూ. లక్ష చొప్పున రెండు పూచీకత్తు బాండ్లను సమర్పించడంతోపాటు, కోర్టు ముందస్తు అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని షరతు విధించారు. అలాగే ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ దర్యాప్తులో జోక్యం చేసుకోరాదని, సాక్ష్యులను ప్రభావితం చేసే ప్రయత్నం చేయరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వైద్యుల అభిప్రాయాన్ని పరిశీలిస్తే మోపిదేవి వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు స్పష్టమవుతోందని, చికిత్స పొందేందుకు మాత్రమే బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తీవ్రమైన వెన్నెనొప్పితో బాధపడుతున్నానని, 3 నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని మోపిదేవి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
మోపిదేవికి తాత్కాలిక బెయిల్
Published Tue, Sep 17 2013 3:43 AM | Last Updated on Sat, Jul 6 2019 12:52 PM
Advertisement