సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. వాన్‌పిక్ ద్వారా పలు ప్రయోజనాలు కల్పించినందుకు నిమ్మగడ్డ ప్రసాద్ జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టారని ఆరోపిస్తూ వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సీబీఐ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టి వేసింది. చట్టం అనుమతినిస్తే మినహా కంపెనీపై వచ్చిన నేరారోపణలకు, కంపెనీ చర్యలకు దాని చైర్మన్‌నుగానీ, ఆ కంపెనీని నడుపుతున్న వ్యక్తులను గానీ బాధ్యులుగా చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వాన్‌పిక్ ప్రాజెక్ట్స్‌పె సీబీఐ నమోదు చేసిన అభియోగ పత్రాన్ని (చార్జిషీట్) విచారణ నిమిత్తం పరిగణలోకి (కాగ్నిజెన్స్) తీసుకునేటప్పుడు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం యాంత్రికంగా వ్యవహరించిందని హైకోర్టు తేల్చి చెప్పింది.
అభియోగపత్రాన్ని విచారణకు స్వీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసే సమయంలో సీబీఐ కోర్టు మెదడు ఉపయోగించలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ అనేది ఓ వ్యక్తి కాదనే విషయాన్ని సీబీఐ కోర్టు పరిగణలోకి తీసుకోలేదని పేర్కొంది. అంతేకాక వాన్‌పిక్ ప్రాజెక్ట్స్‌పైగానీ, దానికి నేతృత్వం వహిస్తున్న నిమ్మగడ్డ ప్రసాద్‌పైగానీ సీబీఐ ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని సంతృప్తి చెందేందుకు సీబీఐ కోర్టు ఎలాంటి కారణాలను నమోదు చేయలేదని తేల్చి చెప్పింది. చార్జిషీటు, దానితో జత చేసిన డాక్యుమెంట్లు, ఆఫీసు నోటు, కోర్టు తీర్పులను మాత్రమే సీబీఐ కోర్టు పరిశీలించిందని తెలిపింది. సీబీఐ ఆరోపణలకు ఓ కార్పొరేట్ సంస్థగా వాన్‌పిక్స్ ప్రాజెక్ట్స్ లేదా దాని చైర్మన్‌గా ప్రాథమిక ఆధారాలున్నాయా? కార్పొరేట్ సంస్థ చేసినట్లు ఆరోపిస్తున్న నేరాలకు చైర్మన్ మాత్రమే బాధ్యత వహించాలా? అన్న విషయంలో సీబీఐ ఎలాంటి కారణాలను నమోదు చేయలేదని హైకోర్టు స్పష్టం చేసింది.
కార్పొరేట్ సంస్థ ఓ వ్యక్తి కాదని, అలాంటి కంపెనీ లేదా కార్పొరేషన్ నేరస్తుడైతే, అందుకు సంబంధించిన బాధ్యతను దాని డైరెక్టర్లకు గానీ, ఆ కంపెనీని నడుపుతున్న వ్యక్తులకుగానీ యాంత్రికంగా ఆపాదించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. నేరస్తులు కంపెనీకి చెందిన వారన్న కారణంతో కంపెనీ తప్పులకు వారిని యాంత్రికంగా బాధ్యులుగా చేయడానికి వీల్లేదంది. చైర్మన్‌గా నిమ్మగడ్డ ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేట్ సంస్థ అయిన వాన్‌పిక్ ప్రాజెక్ట్స్‌పై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు అనుమతినిచ్చినట్లయితే అంతిమ న్యాయం చేసినట్లు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ గురువారం కీలక తీర్పు వెలువరించారు.
నిరంజన్‌రెడ్డి వాదనలతో ఏకీభవించిన సీజే...
సీబీఐ తమపై నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2016లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై ఇటీవల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ గురువారం తీర్పు వెలువరించారు. సహేతుక కారణాలు చూపకుండానే సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను సీబీఐ కోర్టు కాగ్నిజెన్స్‌లోకి తీసుకుందన్న వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భుయాన్ ఏకీభవించారు. వాన్‌పిక్ ప్రాజెక్టŠస్ లాంటి కృత్రిమ వ్యక్తిని ప్రాసిక్యూట్ చేసేందుకు అవసరమైన ప్రాథమిక ఆధారాలు లేవని, ఈ విషయాన్ని కింది కోర్టు పూర్తిగా విస్మరించిందన్న నిరంజన్‌రెడ్డి వాదనను సైతం జస్టిస్ భుయాన్ పరిగణలోకి తీసుకున్నారు. చార్జిషీట్‌ను కాగ్నిజెన్స్‌లోకి తీసుకోవడం అన్నది మెదడు ఉపయోగించి చేయాల్సిన ప్రక్రియ అని, అది యాంత్రికంగా చేసే ప్రక్రియ ఎంత మాత్రం కాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని ప్రధాన న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
అలాంటప్పుడు నేరాన్ని ఆపాదించరాదు...
‘కాగ్నిజెన్స్ తీసుకునే విషయంలో మేజిస్ట్రేట్‌కు విస్తృత అధికారం ఉన్నప్పటికీ న్యాయపరంగా సహేతుక రీతిలో ఉపయోగించాలి. నేరం గురించి నిందితులకు అవగాహన కల్పించే విషయంలో కాగ్నిజెన్స్ అన్నది ఓ ప్రక్రియ అంటూ సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టంగా చెప్పింది. కాగ్నిజెన్స్ అన్నది మేజిస్ట్రేట్ ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలను, నమోదు చేసిన వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకుని, నిందితులు చట్టాన్ని ఉల్లంఘించారా? లేదా? అన్న దానిపై దృష్టి సారించడానికే తప్ప, వ్యక్తులను కోర్టు ముందు హాజరుపరచడానికి, కోర్టు ముందుకు పిలిచేందుకు ఉపయోగించే యాంత్రిక ప్రక్రియ ఎంతమాత్రం కాదు.
నేరపూరిత ఉద్దేశంతో కంపెనీ లేదా దానిని నడిపిస్తున్న వ్యక్తులు నేరం చేసినట్లైతే ఆ నేరానికి ఆ కంపెనీని, ఆ వ్యక్తులను బాధ్యులుగా చేయవచ్చు. అయితే ఏ ఏ సందర్బాల్లో అలా బాధ్యులుగా చేయవచ్చో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కంపెనీ చేసిన నేరానికి ఆ కంపెనీని నడిపిస్తున్న వ్యక్తులను బాధ్యులుగా చేయాలంటే అందుకు చట్టం అనుమతినించి ఉండాలి. నేరంలో ఆ వ్యక్తుల పాత్ర ఉన్నట్లు నిర్దిష్ట ఆధారాలు ఉంటే, నేరానికి ఆ వ్యక్తులను బాధ్యులుగా చేయవచ్చు. ఈ సందర్భాల్లో మినహా మిగిలిన సందర్భాల్లో కంపెనీ చేసిన నేరానికి ఆ కంపెనీని నడిపిస్తున్న వ్యక్తులను యాంత్రికంగా బాధ్యులుగా చేయడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు తన తీర్పుల ద్వారా చాలా స్పష్టంగా చెప్పింది.’అని జస్టిస్ భుయాన్ స్పష్టం చేశారు.
స్వతఃసిద్ధ అధికారాలను ఉపయోగించొచ్చు...
‘క్రిమినల్ కేసుల్లో నిందితులకు సమన్లు జారీ చేయడం అన్నది చాలా తీవ్రమైన విషయం. క్రిమినల్ లాను అమలు చేసే చర్య ఇది. సమన్లు జారీ చేయాలంటే, సంబంధిత మేజిస్ట్రేట్ నిందితులైన మేనేజింగ్ డైరెక్టర్, కంపెనీ సెక్రటరీ, ఇతర డైరెక్టర్లకు వ్యతిరేకంగా ప్రాథమికాధారాలు ఉన్నాయని సంతృప్తి చెందుతూ అందుకు కారణాలను నమోదు చేయాలి. ప్రస్తుత కేసులో కూడా సీబీఐ కోర్టు వాన్‌పిక్ ప్రాజెక్ట్స్, దాని చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్‌కు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలున్నాయని సంతృప్తి చెందేందుకు ఎలాంటి కారణాలను నమోదు చేయలేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కంపెనీ చేసిన నేరాన్ని దాని చైర్మన్‌కు ఆపాదించడానికి ఎంత మాత్రం వీల్లేదు.
అంతిమ న్యాయం అందించేందుకు, న్యాయ ప్రక్రియ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు హైకోర్టు సీఆర్‌పీసీ సెక్షన్ 482 కింద తనకున్న స్వతఃసిద్ధ అధికారాలను ఉపయోగించవచ్చు. ఈ అధికారాన్ని ఉపయోగించి క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొట్టేయవచ్చు. చైర్మన్‌గా నిమ్మగడ్డ ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేట్ సంస్థ అయిన వాన్‌పిక్ ప్రాజెక్టులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు అనుమతినిచ్చినట్లయితే అంతిమ న్యాయం చేసినట్లు అవదు. అందువల్ల వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో వాన్‌పిక్ ప్రాజెక్టులపై పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టి వేస్తున్నాం’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భుయాన్ తన తీర్పులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment