సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో వాన్‌పిక్ పెట్టుబడులకు సంబంధించిన కేసులో నిందితునిగా ఉన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై అవినీతి నిరోధక చట్టం(పీసీయాక్టు) కింద మోపిన అభియోగాలను విచారణకు స్వీకరించాలని కోరుతూ తాము దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను వాయిదా వేయాలని సీబీఐ సోమవారం ప్రత్యేక కోర్టుకు నివేదించింది. ధర్మానపై పీసీ యాక్టు అభియోగాలను నమోదు చేయడాన్ని తప్పుబడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, అక్టోబరు మొదటి వారంలో విచారణకు వచ్చే అవకాశం ఉందని సీబీఐ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేంద్ర విజ్ఞప్తి చేశారు. తమ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే వరకూ... ఇక్కడ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ప్రక్రియను ఆపాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి దుర్గాప్రసాద్‌రావు విచారణను అక్టోబరు 21కి వాయిదా వేశారు.