సాక్షి కడప : ప్రస్తుతం మారుతున్న కాలంలో విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టాలని.. తద్వారా వినూత్న ప్రయోగాలతో సత్ఫలితాలను ఆవిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. మంగళవారం సాయంత్రం యోగి వేమన యూనివర్సిటీలో జ్ఞానభేరి కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి మాట్లాడుతూ పిల్లలు ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కంప్యూటర్ కాలంలో ఎక్కడ చూసినా డిజిటలైజేషన్ కనిపిస్తోందని.. విద్యార్థులు కూడా ఒక విజన్ ప్రకారం ముందుకెళితే విజయం సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ప్రతి అంశం కూడా ప్రస్తుతం రియల్ గవర్నెన్స్ ద్వారా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. వయా డాట్ కామ్ మంత్రను వినియోగిస్తున్నామని.. దీనిపై నాయకులతోపాటు ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని చెప్పారు. రానున్న 2050 నాటికి అనేక అంశాలకు సంబంధించిన టార్గెట్లు పెట్టుకున్నామని.. ప్రపంచంలో అన్ని అంశాల్లోనూ నెంబర్ వన్‌గా మనమే ఉంటామని పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడేలా ప్రయోగాలు చేసేందుకు ఆలోచనలు చేయాలని పేర్కొన్నారు. కలలు కనండి.. నిజం చేసుకోండి.. కాని పక్షంలో అమలు చేయడానికి నేనుంటానని బాబు పేర్కొన్నారు.
ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన
కేంద్రం అన్ని విధాలా రాష్ట్రానికి అన్యాయం చేసిందని, ఏ ఒక్క అభివృద్ధి విషయంలో కూడా మేలు చేయలేదని సీఎం దుమ్మెత్తిపోశారు. కడపలో ఖనిజ వనరులతోపాటు కరెంటు, భూమి, నీరు, రోడ్లు అన్నీ ఉన్నా ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదని విమర్శించారు. నాలుగేళ్లపాటు ఎదురుచూశామని, ఇంతవరకు ఎలాంటి నిర్ణయం కేంద్రం నుంచి రాకపోవడంతో తామే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని సంకల్పించినట్లు బాబు తెలిపారు. అందుకు సంబంధిం చి ఈనెల 27వ తేదీన ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
‘ఫాతిమా’ విద్యార్థులకు న్యాయం చేస్తాం
కడపకు సంబంధించి ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థులకు న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. అవసరమైతే వైద్య విద్యకు ప్రభుత్వమే గ్రాంటు ఇచ్చి వారి సమస్యను పరిష్కరించేలా ఆలోచిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు.
నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు నీరు
రాష్ట్రంలో ఇప్పటికే కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసి చరిత్ర సృష్టించామని.. మరొకమారు గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీరు అందించేందుకు కృషి చేస్తామని సీఎం తెలిపారు. రాయలసీమతోపాటు ప్రకాశం జిల్లా, కరువుతో అల్లాడిపోతున్న జిల్లాల్లో నీటిని పారిస్తామని.. తద్వారా సస్యశ్యామలం చేయనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయానికి అండదండగా ఉంటూ ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు.
సింథటిక్ ట్రాక్ ఏర్పాటుకు కృషి
జిల్లాలోని యోగి వేమన యూనివర్సిటీలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటుకు సుమారు రూ. 25 కోట్లు అవసరమవుతుందని.. మంజూరు చేయాలంటూ ప్రతిపాదన వచ్చిన నేపథ్యంలో ఏర్పాటుకు కృషి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, ఎంపీ సీఎం రమేష్, టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, కలెక్టర్ హరి కిరణ్, వైస్ చాన్స్‌లర్ ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి, జేసీ కోటేశ్వరరావు, స్పెషల్ సెక్రటరీలు ఆదిత్యనాథ్‌దాస్, గిరిజాశంకర్, ఉన్నత విద్యాశాఖకమిషనర్ సుజాతశర్మ, ఉన్నత విద్యా మండలి చైర్మన్ విజయరాజు, కార్యదర్శి వరదరాజన్, అధికారులు కోటేశ్వరరావు, వెంకట్ ఈదర్, టెక్సాస్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ కర్బారి, డాక్టర్ అశ్వంత్, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ వర్లు, అవధాని గరికపాటి నరసింహారావు, సినీ గాయకుడు గంగాధర్‌శాస్త్రి పాల్గొన్నారు.
వైవీయూ జ్ఞానభేరి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
Published Wed, Dec 5 2018 1:59 PM | Last Updated on Wed, Dec 5 2018 1:59 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment