ఇంటర్‌ పరీక్షల నిర్వహణ.. ప్రతి గదిలో కెమెరా | CC Camera Safety in Intermediate Exams SPSR Nellore | Sakshi
Sakshi News home page

కెమెరా కన్ను

Published Tue, Feb 25 2020 1:32 PM | Last Updated on Tue, Feb 25 2020 1:32 PM

CC Camera Safety in Intermediate Exams SPSR Nellore - Sakshi

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలపై కెమెరా కన్ను నిఘా పెట్టనుంది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి విమర్శలు, ఆరోపణలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్‌ బోర్డు అధికారులు సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. తొలిసారిగా పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరిగే తీరును సీసీ కెమెరాల ద్వారా ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించనున్నారు. జంబ్లింగ్‌ విధానంలో ఇన్విజిలేటర్లను కేటాయించనున్నారు. మార్చి 4 నుంచి 23 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షల షెడ్యూల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

నెల్లూరు (టౌన్‌):  జిల్లాలో 208 ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 56,789 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి జనరల్‌లో 28,587 మంది, ఒకేషనల్‌కు సంబంధించి 1,572 మంది, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జనరల్‌లో 25,590 మంది, ఒకేషనల్‌కు సంబంధించి 1,040 మంది పరీక్షలు రాయనున్నారు. ఇందుకు సంబంధించి పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను చురుగ్గా చేస్తున్నారు. ఇప్పటికే ఇంటర్‌ ప్రశ్నపత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ నిబంధనను కూడా అమలు చేయనున్నారు.

నూతన ఒరవడికి శ్రీకారం
ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో విద్యార్థులు ఇబ్బందులు, ఒత్తిడికి గురి కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే విద్యార్థుల హాల్‌ టికెట్లను ఆన్‌లైన్లో ఉంచారు. వీటిని డౌన్‌లోడ్‌ చేసుకొని విద్యార్థులు నేరుగా పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని కల్పించారు. గతంలో మాదిరిగా హాల్‌ టికెట్లు కోసం కళాశాలల చుట్టూ విద్యార్థులు తిరగాల్సిన అవసరం ఇక ఉండదు. విద్యార్థి ఇచ్చిన ఫోన్‌ నంబర్‌కు పరీక్ష కేంద్ర పేరుతో పాటు గది నంబర్‌ వివరాలను మెసేజ్‌ రూపంలో పంపనున్నారు.

సీసీ కెమెరాల ఏర్పాటు
ఇంటర్‌ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు నిఘా నీడలో జరగనున్నాయి. పరీక్షలు జరగనున్న అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను బిగించనున్నారు. జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలో పరీక్షలు నిర్వహించే ప్రతి గదిలో సీసీ కెమెరాలను బిగించాలని ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారులు ఆదేశించారు. సీసీ కెమెరాల ద్వారా పరీక్షలు జరుగుతున్న తీరును నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను బిగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరిగితే సీసీ కెమెరాల లైవ్‌ ద్వారా అధికారులు వెంటనే గుర్తించేందుకు అవకాశం ఉంది.

జంబ్లింగ్‌ ద్వారాఇన్విజిలేటర్ల నియామకం
ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా ఇంటర్‌ బోర్డు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పరీక్షలకు ఇన్విజిలేటర్లను జంబ్లింగ్‌ ద్వారా నియమించనున్నారు. పరీక్ష జరగనున్న కళాశాలలో అదే కళాశాలకు చెందిన ప్రిన్సిపల్, అధ్యాపకులు, సిబ్బంది ఎవరూ విధులు నిర్వర్తించే అవకాశం ఉండదు. పరీక్షకు ఇన్విజిలేటర్లు రోజు రోజుకు మారుతుంటారు. పరీక్షలకు 87 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 87 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులను నియమించనున్నారు. ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న అధ్యాపకులతో టాస్క్‌ఫోర్స్‌ స్క్వాడ్లను ఏర్పాటు చేయనున్నారు. వీరితో పాటు ఫ్లయింగ్, సిట్టింగ్‌ స్క్వా డ్లు నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే తొలి విడతలో జిల్లాకు చేరిన ఇంటర్‌ ప్రశ్నపత్రాలను నగరంలోని కేఏసీ కళాశాలలో స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపర్చారు. రెండో విడతగా మరో రెండు రోజుల్లో ప్రశ్నపత్రాలు రానున్నాయి. వీటిని ఆయా పరీక్ష కేంద్రాల సమీపంలోని పోలీస్‌స్టేషన్లకు చేర్చనున్నారు. అక్కడి నుంచి ఏ రోజుకు ఆ రోజు పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రాలను కేంద్రానికి తీసుకెళ్లనున్నారు.

26న వీడియో కాన్ఫరెన్స్‌
ఇంటర్మీడియట్‌ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 26న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఇంటర్‌ పరీక్షలపై అన్ని జిల్లాల ప్రాంతీయ పర్యవేక్షణాధికారులు, వృత్తి విద్యాశాఖాధికారులతో వీడి యో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నా రు. అనంతరం ఆర్‌ఐఓ, డీవీఈఓలు పరీక్షలకు సంబంధించి చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులతో సమావేశం కానున్నారు.

అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను బిగించేలా ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్‌కు ఆదేశాలు జారీ చేశాం. ఈ వారంలో చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులతో సమావేశాన్ని నిర్వహించనున్నాం. కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపడతాం. విద్యార్థులకు అవసరమైన బెంచీలు, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర వసతులను కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.– శ్రీనివాసరావు, ఆర్‌ఐఓ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement