సాక్షి, గుంటూరు: జిల్లా అంతటా మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే విషయంలో సీసీఐ (భారత పత్తి సంస్థ) అలసత్వాన్ని కనబరుస్తోంది. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తోంది. దీంతో చేతికందిన పత్తిని రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో దళారులు, వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. తడిసిన పత్తి, గుడ్డికాయ పేరుతో దళారులు సరైన ధర నిర్ణయించడం లేదు. దీంతో క్వింటాకు రూ.500 నుంచి రూ.600 వరకు రైతులు నష్టపోతున్నారు. ఈ ఏడాది జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో రైతులు 1.44 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. నవంబరు రెండో వారం నుంచే దిగు బడి మొదలైంది.
ఇప్పటికే రైతులు ఎకరాకు 10 క్వింటాళ్ల చొప్పున ఇళ్లకు చేర్చారు. దీన్ని గుర్తించిన కాటన్ జిన్నింగ్ మిల్లులు, వ్యాపారులు పత్తి కొనుగోలుకు దళారులను రంగంలోకి దించారు. క్వింటా పత్తిని రూ.3600 నుంచి రూ.4000 వరకు కొంటున్నారు. గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, రాజుపాలెం, సత్తెనపల్లి, నర్సరావుపేట, వినుకొండ, నకరికల్లు ప్రాంతాల్లోని పత్తి అక్టోబరులో కురిసిన భారీ వర్షాలకు పాడవటంతో దళారులు, వ్యాపారులు తక్కువ ధరకు కొనేందుకు బేరమాడుతున్నారు. గుడ్డికాయ, తడిసిన పత్తంటూ రేటు కోసేస్తున్నారు. సీసీఐ కొనుగోలు కేం ద్రాలు లేనందున గత్యంతరం లేక రైతులు వీరికే పత్తిని విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు తక్కువలో తక్కువగా క్వింటాలుకు రూ.3500 మాత్రమే చెల్లిస్తున్నారు.
దీంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఏటా డిసెంబరు మొదటి వారంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే సీసీఐ అధికారులు ఈ ఏడాది ఎందుచేతనో మీనమేషాలు లెక్కిస్తున్నారు. కిందటేడాది డిసెంబరు మొదటి వారంలోనే జిల్లా అంతటా ఉన్న 10 మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలను తెరిచి ఏడాది మొత్తం మీద 7.38 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసిన సీసీఐ ఈ ఏడాది ఇంకా ముందుకు రాకపోవడం ఇబ్బందికరంగా మారిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
సీసీఐ డీజీఎంను కలిసిన ఆర్‌జేడీ.. కాగా గురువారం మధ్యాహ్నం గుంటూరు వచ్చిన సీసీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ చతుర్వేదిని మార్కెటింగ్ శాఖ రీజినల్ జాయింట్ డెరైక్టర్ కాకుమాను శ్రీనివాసరావు కలిశారు. జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై మాట్లాడారు. నర్సరావుే ప టలో ఇప్పటికే ఒక కొనుగోలు కేంద్రం న డుస్తోందనీ, ఈ నెల 16న రెండో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశామని చతుర్వేది వివరించారు. నెలాఖరులోగా పిడుగురాళ్ల, సత్తెనపల్లి, మాచర్ల, వినుకొండ యార్డుల్లోనూ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే పత్తి కొనుగోలు చేసే సీసీఐ బయ్యర్లతో మాట్లాడామనీ, సీసీఐ నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్‌లో రైతులకు మంచి ధర లభిస్తున్న నేపథ్యంలో పత్తి రైతులకు పెద్దగా ఇబ్బందులేమీ లేవని సీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఏదిఏమైనా వారంలోగా అన్ని యార్డుల్లో సీసీఐ కేంద్రాలు తెరిచి సరైన ధరకు పత్తి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
ధర లేదు.. సీసీఐ రాదు
Published Fri, Dec 13 2013 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
Advertisement
Advertisement