శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట ప్రభుత్వం జిల్లాలో పలు నియోజకవర్గాలపై సవతి ప్రేమ కురిపిస్తుంది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెండు నియోజకవర్గాలకే అభివృద్ధి నిధులు(సీడీపీ)మంజూరు చేసింది. శ్రీకాకుళం, నరసన్నపేటలకు మాత్రమే రూ. 2 కోట్లు వంతున విడుదల చేశారు. మిగిలిన ఎనిమిది నియోజకవర్గాలను విస్మరించారు. ఈ కేటాయింపుల వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ రెండు చోట్లా వైఎస్సార్‌సీపీ బలంగా వేళ్లూనుకుని ఉండడంతో ప్రభుత్వం దృష్ఠి సారించిందని భోగట్టా.
త్వరలో శ్రీకాకుళం నగర పాలక సంస్థకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రెండేళ్లుగా అభివృద్ధికి నోచుకోని ఈ పట్టణంలో ఇప్పుడు నిధులు గుమ్మరించి ప్రజలు మెప్పు పొందాలన్నదే ప్రభుత్వం యోచనగా తెలుస్తుంది. నరసన్నపేటలో గడచిన రెండు ఏళ్లుగా ఒక కొత్త పనికీ నిధులు విడుదల చేయలేదు. గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను పూర్తి చేసి తమ ప్రగతిగా టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. దీంతో నరసన్నపేటలో అసంతృప్తి పెల్లుబుకుతోంది. రాజధానిని తాకిన అసంతృప్తిని బుజ్జగించేందుకు ఇక్కడ నిధులు విడుదల చేసినట్లు సమాచారం.
టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకూ శాసన సభా నియోజకవర్గం అభివృద్ధి నిధులను విడుదల చేయలేదు. అన్ని నియోజక వర్గాల్లోనూ పనులు నిలిచిపోయాయి. ఆర్ధిక మాంద్యం, రాష్ట్ర విభజన సాకుగా రెండేళ్లుగా నిధుల మంజూరు నిలిపివేసింది. జిల్లాలో పది శాసన సభా నియోజకవర్గాలున్నాయి. ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. దీంతో ఈ రెండేళ్లలో జిల్లాలో రూ. 25 కోట్ల మేర అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. మరో నెలరోజుల్లో ఈ ఆర్ధిక సంవత్సరం ముగియనుంది.
ఆ రెండింటిపై ప్రేమెందుకో..
Published Fri, Feb 26 2016 12:43 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement