అమలాపురం :‘ఖర్చు బారెడు.. కేటాయింపులు మూరెడు’ అన్నట్టుగా ఉంది పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు కేటాయిస్తున్న తీరు. అనేక జిల్లాలకు తాగు, సాగునీటిని అందించడంతో పాటు విద్యుదుత్పత్తి చేసే ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.వంద కోట్లు మాత్రమే కేటాయించడంపై నిరసన వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంతో గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.250 కోట్లు తిరిగి చెల్లిస్తూ నిధులు విడుదల చేసింది. ఇక్కడి బీజేపీ నేతలు గొప్పగా చెప్పినట్టు కాక.. రూ.వెయ్యి కోట్ల కేటాయింపు విషయాన్ని కేంద్రం పక్కన బెట్టడంతో జిల్లాలోని డెల్టా, మెట్ట రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
హామీలే.. ఆచరణ లేదు
పక్క రాష్ట్రాల అభ్యంతరాలు, అవాంతరాల నడుమ ముందుకు సాగని పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర విభజన నేపథ్యంలో జాతీయహోదా దక్కింది. రాజధాని కూడా లేని కొత్త రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు మేలు చేస్తుందని విభజన బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టిన సమయంలో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేస్తామని ఎన్నికల సమయంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత అటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడానికి నడుం కట్టిన దాఖలాలు కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో తెలంగాణ పరిధిలో ఉన్న పోలవరం ముంపు మండలాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్ చేయడం, తరువాత లోక్‌సభ, రాజ్యసభలో బిల్లు ఆమోదింప చేయడంతో జిల్లాలోని డెల్టా, మెట్ట రైతులకు ప్రాజెక్టు నిర్మాణంపై ఆశలు చిగురించాయి.
ఎన్నెన్ని ప్రయోజనాలో..
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఉభయ గోదావరి జిల్లాల్లోని 10.50 ఎకరాల డెల్టా ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. రెండు పంటలకు నిశ్చయంగా సాగునీరు అందించవచ్చు. పోలవరం పూర్తయితే మన జిల్లాలో 4.80 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న తూర్పు, మధ్యడెల్టాల్లో సాగు స్థిరీకరణ జరుగుతుంది. ఏటా రబీలో రివాజైన నీటి ఎద్దడి అనేది లేకుండా పోతోంది. ఈ రెండు జిల్లాలతోపాటు పోలవరం కుడి, ఎడమల కాలువల ద్వారా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో సుమారు 7.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది. మన జిల్లాలో ఈ ప్రాజెక్టు నిర్మాణ వల్ల మెట్టలో లక్ష ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని అంచనా. రోజుకు 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కృష్ణా డెల్టా పరిధిలో 13.00 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల ద్వారా కృష్ణాడెల్టాకు నీటి కేటాయింపులు తగ్గించి ఆ మేరకు రాయలసీమకు సాగు, తాగునీరు పెంచే అవకాశముంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నందున మన జిల్లాకు చెందినవారే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారూ ఈ ప్రాజెక్టు కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తుంటే కేంద్రం అరకొర కేటాయింపులతో పోల‘వరం’ ఇంకా బహుదూరం అన్నట్టు చేస్తోంది.
ఇలా అరుుతే దశాబ్దాలు గడిచినా పూర్తి కాదు..
రూ.16వేల కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును కేంద్రం ప్రకటించినట్టుగా నాలుగేళ్లలో పూర్తి చేయాలంటే ఏడాదికి రూ.నాలుగు వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రైతు సంఘాల నాయకులు, రాష్ట్రంలోని వివిధ రాజకీయ పక్షాలు ఈ కేటాయింపులపై ఘాటైన విమర్శలు చేశాయి. దీనితో స్పందించిన ఇక్కడి బీజేపీ నేతలు పోలవరానికి కనీసం రూ.వెయ్యి కోట్లు అయినా కేటాయించాలని కేంద్రంపై ఒత్తిడి పెంచారు. ఇందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తోందనీ వారు ప్రకటించారు. అయితే కేంద్రం ప్రభుత్వం మాత్రం 2014 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రం ఖర్చు చేసిన నిధులలో రూ.250 కోట్ల రీ రుుంబర్స్‌మెంట్‌కు అంగీకరించిందే తప్ప, ఈ ఏడాది రూ.100 కోట్లకు మించి అదనంగా నిధులు పెంచలేదు. ఈ ప్రకటనతో డెల్టా, మెట్ట రైతుల్లో నిరుత్సాహం చోటు చేసుకుంది. ఇలా అరకొర కేటాయింపులు చేస్తే ఈ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని, దశాబ్దాలు దాటిపోతుందని ఆందోళన చెందుతున్నారు.
పోల‘వరం’.. బహుదూరం
Published Sat, Mar 28 2015 3:02 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement