అనంతపురం కల్చరల్ : కేంద్ర ప్రభుత్వ పథకాలను తన పథకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం శోచనీయమని భారతీయ యువ మోర్చా రాష్ట అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. స్థానిక మునిసిపల్ అతిథి గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరులతో సమావేశంలో విష్ణువర్ధన్‌రెడ్డితోపాటు బీజేపీ రాష్ర్ట నాయకులు ఎంఎస్ పార్థసారథి, లలిత్‌కుమార్, మజ్దూర్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు, అంబటి రామక్రిష్ణారెడ్డి, పత్తి చంద్రశేఖర్, వెంకటరమణప్ప తదితరులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నీతినిబద్ధలతో వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా గ్యాస్ ఏజెన్సీలు, ఎంపీడీవోలు కుమ్మక్కై కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు.
ఎలాంటి రుసుము లేకుండా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు కేంద్రం యత్నిస్తుంటే గ్యాస్ ఏజెన్సీలు వేల రూపాయలు పేదల నుంచి వసూలు చేస్తున్నారన్నారు. దీపం పథకం తమదిగా రాష్ట్ర ప్రభుత్వం చాటుకుంటోందని, కనీసం అవినీతి లేకుండా కనెక్షన్‌లు ఇచ్చేదిశగా కలెక్టర్ చూడాలన్నారు. 14వ ఆర్థిక సంఘం ఏపీకి అధిక శాతం నిధులిస్తున్నా ప్రతిపక్షాల వారు నరేంద్ర మోదీని బలహీనపరిచే దిశగా విమర్శలు చేయడం బాధాకరమన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన అన్ని వాగ్దానాలను నెరవేర్చేదిశగా బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. దశల వారీగా ఏపీకి పూర్తి సహకారమందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన చొరవ చూపకపోవడంతో అభివృద్ధి పనుల్లో జాప్యం ఏర్పడుతోందన్నారు.
పరిశ్రమల స్థాపన కోసం చర్యలు తీసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణలో తగిన విధంగా స్పందించడంలేదన్నారు. పార్థసారథి మాట్లాడుతూ ఎల్‌ఈడీ బల్బుల విషయంలో కూడా సామాన్యులు భారాన్ని మోయవలసి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పథకం కింద కేవలం పది రూపాయలను మాత్రమే వసూలు చేయాలని నిబంధన ఉన్నా రాష్ర్ట ప్రభుత్వాలు ముప్పై నుంచి నలబై రూపాయల వరకు వసూలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గడ్డి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రం అందుకు తగ్గ ట్రాన్స్‌పోర్టును ఉచితంగా అందించడానికి ముందుకోచ్చిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, రమణ పాల్గొన్నారు.
కుంభకోణాన్ని బహిర్గతం చేయాలి
Published Thu, Feb 26 2015 2:24 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement