మద్యం మత్తులో ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. తెలిసీతెలియని తనంలోని మైనర్లకు తల్లిదండ్రులే బైక్ ఇచ్చి జనం ప్రాణాలకు మీదుకు తెస్తున్నారు. రహదారిపై డ్రైవింగ్ రూల్స్ పాటించకుండా వన్‌వేలో వెళ్లడం, హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకోకుండా వాహనాలు నడపడంతో ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో కేంద్రం కొత్త చట్టం అమల్లోకి తెచ్చింది. తాగి వాహనంతో రోడ్డెక్కితే, మైనర్లకు వాహనాలు నడిపితే కారకులకు పెనాల్టీల వాతలు పెట్టడానికి నిబంధనలు కఠినం చేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కింద 6,578 కేసులు నమోదు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇకపై ఇలాంటి వారికి భారీగా పెనాల్టీ కిక్ ఇవ్వనున్నారు.
సాక్షి, నెల్లూరు: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే.. పెనాల్టీలతో కిక్ దింపనున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారి మత్తు దిగిపోయేలా కేంద్ర ప్రభుత్వ మోటారు వాహన చట్టానికి సవరణ తెచ్చింది. ఇందుకు అవసరమైన బిల్లుకు ఇటీవల పార్లమెంట్‌లో ఆమోదం లభించింది. ఈ చట్ట సవరణ ద్వారా వాహన చోదకులకు భరోసా కల్పించడంతో పాటు ప్రమాదాలకు కారణమయ్యే అంశాల విషయంలో కూడా తీసుకునే చర్యలను కఠిన తరం చేసింది. ఇక జరిమానాలతో పాటు ట్రాఫిక్ నిబంధన అతిక్రమణ అంశంలో ‘సమాజసేవ’ చేయాలనే శిక్షను కూడా ఈ చట్ట సవరణతో అమల్లోకి తెస్తున్నారు. రోడ్డు ప్రమాద బాధితుల రక్షణార్థం చేసే వైద్య సహాయ చర్యలను సదుద్దేశంతో పరిగణించే అంశాన్ని చట్టంలో పొందు పరిచారు. ఈ విధంగా సహాయం చేసే వారికి పోలీసు, కోర్టు, వేధింపులు లేకుండా ఈ చట్ట సవరణ దోహద పడుతోంది.
మైనర్లు వాహనాలు నడిపితే నేరమే
ఇకపై జరిగే రోడ్డు ప్రమాదాలకు రోడ్ల నిర్మాణం లోపమే కారణమైతే సదరు రోడ్డు నిర్వహణ శాఖ నుంచి పరిహారాన్ని వసూలు చేస్తారు. మైనర్లు వాహనాలు నడిపితే పెద్ద నేరంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. అందుకు రూ.25 వేలు జరిమానాను విధించడమే కాకుండా ప్రమాదాలు సంభవిస్తే దానికి మూల్యాన్ని కారకుడైన మైనర్ తల్లిదండ్రులు లేదా గార్డియన్‌తో పాటు వాహన యజమాని కూడా చెల్లించాల్సి వస్తుంది. వాహన ప్రమాదాల్లో పరిహారం కోసం దాఖలు చేసుకొనే వ్యాజ్యాలను ఇకపై ప్రమాదం జరిగిన ఆరు నెలల్లో దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తు తెలియని వాహనాల ప్రమాదంలో సంభవించే మరణాల కుటుంబాలకు క్షత్రగాత్రులకు పరిహారాన్ని చెల్లించే ఈ చట్టంలో పొందు పరిచారు. ఈ పథకం కింద మరణానికి రూ.2 లక్షలు, క్షత్రగాత్రులకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు పరిహారం దక్కేలా చర్యలు చేపడతారు. కొత్తగా వాహన ప్రమాద నిధిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక పన్నులు, సీజ్‌ల ద్వారా ఈ నిధిని సమకూర్చుతారు. ఈ నిధి ద్వారా వాహన ప్రమాద బాధితులకు వినియోగిస్తారు. ఇలా అనేక మార్పులతో పాటు నిబంధనలు ఉల్లంఘనలకు జరిమానాలను విపరీతంగా పెంచుతూ ఈ దిగువ సవరణలు చేశారు.
జిల్లాలో కొనసాగతున్న స్పెషల్ డ్రైవ్
నేర నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణపై జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ప్రత్యేక దృష్టి సారించారు. వాహన తనిఖీలు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా అన్నీ పోలీస్‌స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనులపై భారీగా జరిమానాలు విధించడంతో పాటు నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం మద్యం మత్తులో జరుగుతుండటంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. పోలీసులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎంవీ యాక్ట్ కింద 1,23,309 కేసులు నమోదు చేయగా, అందులో డ్రంక్ అండ్ డ్రైవ్ కింద 6,578 కేసులు నమోదు చేశారు.
జిల్లాలో కేసుల వివరాలు
సంవత్సరం ఎంవీ యాక్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్
2017 1,33,402 1,172
2018 2,53,978 4,260
2019 1,23,,309 6,015
(ఇప్పటి వరకు)
Comments
Please login to add a commentAdd a comment