రోడ్డు ప్రమాదాల నివారణకు అత్యంత కీలకంగా భావిస్తోన్న మోటారువాహనాల సవరణ బిల్లు 2017, లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. రాష్ట్రప్రభుత్వాల అధికారాలను ఈ బిల్లు నియంత్రిస్తోందనీ, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైందన్న ఆరోపణలతో విపక్షాలు ఈ బిల్లుని అడ్డుకున్నాయి. అయితే విచ్చలవిడిగా జరుగుతోన్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించే కీలకమైన అంశాలు ఈ బిల్లులో పొందుపరిచారు.
యేడాదికి 1.46 లక్షల ప్రమాదాలతో ప్రపంచంలోనే ప్రథమస్థానంలో ఉన్న భారతదేశం 2020 కల్లా రోడ్డు ప్రమాదాలను 50 శాతం తగ్గించాలని ఐక్యరాజ్యసమితి సూచించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రమాదాల అంచున సాగే ప్రయాణాలకు ఫుల్ స్టాప్ పడుతుందని అంతా ఆశిస్తున్నారు. ట్రాఫిక్ అతిక్రమణలకు విధించే ఫైన్‌లు మొదలుకొని, ప్రమాదాలకు కారణమైన మైనర్ల విషయంలో వాహన యజమానులను సైతం బాధ్యులను చేసేలా ఈ బిల్లుని తయారుచేశారు.
ఈ బిల్లులో ఏముంది?
1. వాహన రిజిస్ట్రేషన్‌కీ, డ్రైవింగ్ లైసెన్స్‌కీ ఆధార్ తప్పనిసరి.
2. వాహనాలు ఢీ కొట్టి పారిపోయిన దుర్ఘటనల్లో ప్రభుత్వమే బాధితులకు నష్టపరిహారంగా ప్రస్తుతం చెల్లిస్తోన్న 25,000 రూపాయలను 2 లక్షలకు పెంచారు.
3. ప్రమాదాలకు మైనర్లు కారణమైన సందర్భంలో వాహనయజమాని కానీ, సదరు మైనరు సంరక్షకులుగానీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ సంరక్షకులకు గానీ,
వాహన యజమానులకు గానీ ఈ ప్రమాదం తెలియకుండా జరిగినట్టు, లేదా తాము నివారించే ప్రయత్నం చేసామని నిరూపించుకుంటే తప్ప వారే మైనర్ల ప్రమాదాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అది వారికి తెలిసి జరిగినట్టయితే మోటారు వాహనం రిజిస్ట్రేషన్ రద్దుఅవుతుంది. జువైనల్ చట్టం ప్రకారం నేరస్తులను విచారిస్తారు.
4. ప్రమాదంలో ఉన్న వారిని ఆదుకునే వారికి ఈ బిల్లు రక్షణకల్పిస్తోంది. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు తోడ్పడిన వారిని నేరంలో భాగం చేయకుండా ఇది నివారిస్తుంది. బాధితులను ఆసుపత్రిలో చేర్చినప్పుడు సైతం వారు కోరితే వారి వివరాలను పోలీసులు, ఆసుపత్రి వర్గాలు గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది.
5. మత్తుపానీయాలు సేవించి వాహనాలు నడిపిన వారికి ఇప్పుడు విధించే ఫైన్‌ని 2000 నుంచి 10,000 రూపాయలకు పెంచారు.
6. ఇష్టమొచ్చినట్టు రాష్‌గా వాహనాలు నడిపితే విధించే జరిమానాను 1000 రూపాయల నుంచి 5000 రూపాయలకు పెంచారు.
7. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన నేరానికి యిప్పుడు విధిస్తోన్న 500 రూపాయల జరిమానాను 5000 రూపాయలకు పెంచారు.
8. అతివేగంగా వాహనాలు నడిపినందుకు ప్రస్తుతం విధిస్తున్న 400 రూపాయల ఫైన్‌ని 1000, 2000 వరకు పెంచారు.
9. సీటు బెల్టు పెట్టుకోకుండా వాహనం నడిపితే ప్రస్తుతం 100 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. దాన్ని 1000 రూపాయలకు పెంచారు.
10. ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాన్ని నడిపితే ప్రస్తుతం 1000 రూపాయల ఫైన్ వేస్తున్నారు. అది 5000లకు పెంచారు.
11. మోటారు వాహనాల యాక్సిడెంట్ ఫండ్‌లో ఇన్సూరెన్స్ ని కూడా చేర్చారు.
12. దివ్యాంగులకు అవసరమైన రీతిలో వాహనాల నిర్మాణాన్ని తప్పనిసరిచేసారు.
13. నాణ్యతలేని రోడ్లను వేసినందుకు కాంట్రాక్టర్లు సైతం ప్రమాదాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
14. రోడ్డు ప్రమాదాల్లో ఆరునెలల లోపే బాధితులు నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
15. ప్రమాదాల్లో మరణాలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పరిమితిని 10 లక్షలు, తీవ్రమైన గాయాలకు 5 లక్షల చొప్పున చెల్లించాలని 2016 చట్టం పేర్కొంది. ఇప్పుడు
2017 మోటారు వాహనాల బిల్లు ఈ పరిమితిని ఎత్తివేసింది.
16. కాలం తీరిన డ్రైవింగ్ లైసెన్స్‌ని తిరిగి నమోదుచేయించుకోవడానికి గతంలో ఉన్న నెల రోజుల గడువుని యేడాదికి పెంచారు.
17. ఉండాల్సిన స్థాయిలో వాహనం మోటారు నాణ్యత లేనట్టు భావిస్తే ఆయా వాహనాలను ప్రభుత్వమే తిరిగి రప్పించుకోవచ్చు. తక్కువ నాణ్యత కలిగిన వాహనాలు తయారు చేసినందుకుగాను 500 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఈ బిల్లులో కల్పించారు.
- సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment