తాగి నడిపితే అంతే సంగతులు!
గ్రేటర్ హైదరాబాద్ వాహనదారులు ఇకముందు మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదాల నివారణ కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నిబంధనలను కఠిన తరం చేయబోతున్నారు. ద్విచక్ర వాహన దారులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతోంది. ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న వ్యక్తులూ హెల్మెట్ తప్పని సరి చేయబోతున్నారు.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై ఇప్పటి వరకు జరిమానా విధించడంతో సరిపుచ్చుతున్నారు. ఇకనుంచి అలా కాకుండా లెసైన్స్ రద్దు చేసే విధానాన్ని త్వరలోనే అమలులోకి తేనున్నారు. అతి వేగంగా నడపడం, ట్రాఫిక్ సిగ్నల్ ఖాతరు చేయకుండా వెళ్లడం, ఓవర్ లోడ్, డ్రంకెన్ డ్రైవ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ నడపడం... వీటిల్లో ఏది ఉల్లంఘించినా డ్రైవింగ్ లెసైన్స్ రద్దు చేయనున్నారు.
ఇలా నిబంధనలను ఉల్లంఘించిన వారి వివరాలను రవాణా శాఖ కు సమర్పించి నిర్ణీత కాలం పాటు డ్రైవింగ్ లెసైన్స్ సస్పెండు చేయించే విధంగా చర్యలకు హైదరాబాద్ ట్రాపిక్ పోలీసులు ఉపక్రమిస్తున్నారు. డ్రైవింగ్ లెసైన్స్ సస్పెన్షన్ లో ఉన్నప్పుడు వాహనాలను నడిపినట్టు తేలితే నడిపిన వ్యక్తిపై కోర్టులో అభియోగపత్రాలు సమర్పిస్తారు. దానికి గరిష్టంగా మూడు నెలల జైలు శిక్ష తప్పదు.
ఇటీవలి కాలంలో జరిగిన ప్రమాదాలను అధ్యయనం చేసిన తర్వాత టూ వీలర్ల విషయంలో వెనుక కూర్చున్న వారే ఎక్కువగా మృత్యు వాత పడటం గమనించిన తర్వాత ఇక నుంచి వెనుక కూర్చొని ప్రయాణించే వారికీ హెల్మెట్ తప్పని సరి చేయాలని నిర్ణయించినట్టు హైదరాబాద్ నగర ట్రాఫిక్ కమిషనల్ జితేందర్, రవాణా శాఖ కమిషనర్ సందీప్ సుల్తానియా శుక్రవారం మీడియా సమావేశంలో ఇలాంటి పలు విషయాలను వెల్లడించారు.