పర్యాటకంపై నీలినీడలు!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా మెగా టూరిజమ్ సర్క్యూట్ కలగా మారనుంది. ఆఘమేఘాల మీద అంచనా వ్యయంతో ప్రాజెక్టును రూపొందించిన అధికారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విభజన అంశాన్ని సాకుగా చూపి ప్రాజెక్టు మంజూ రు వ్యవహారంలో మొండిచెయ్యి చూపింది. ఖమ్మం జిల్లాలోని పోలవరం కేంద్రంగా మెగా టూరిజం సర్క్యూట్ కోసం అధికారులు రూ. 57 కోట్లతో కేంద్ర టూరిజం మంత్రిత్వశాఖకు నివేదిక పంపారు. ప్రాజెక్టుకు మౌఖిక అంగీకారం తెలిపి తుది దశలో ఉండగా రాష్ట్ర విభజన సాకుతో ప్రసుత్తం ఫైల్ పక్కన పెట్టారు. పర్యవసానంగా ఖమ్మం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యాటక అభివృద్ధి పై నీలినీడలు కమ్ముకున్నాయి.
పోలవరం సందర్శనకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా నుంచి వస్తే భద్రాచలం రామాలయాన్ని సందర్శించిన తర్వాత పోలవరం ప్రాంతం నుంచి పాపికొండలు విహారయాత్రకు వెళుతుంటారు. అయితే ప్రస్తుతం పర్యాటక శాఖ పరంగా కనీస సౌకర్యాలు లేకపోవటంతో ప్రైవేట్ వ్యక్తుల ఇష్టారాజ్యంగా మారింది. అలాగే తూర్పు గోదావరి జిల్లా నుంచి రాజమండ్రి, పశ్చిమగోదావరి జిల్లా నుంచి కొవ్వూరు, పట్టిసీమ ప్రాంతాల్లోని లాంచీల రేవు నుంచి పర్యాటకులు పోలవరం సందర్శనకు వస్తుంటారు. ఈ క్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మెగా టూరిజం సర్క్యూట్ పేరుతో పోలవరానికి అనుబంధంగా ఉండే ప్రాంతాల్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీంతో 2011లో ఖమ్మం జిల్లా అధికారులు ప్రాథమిక ప్రతిపాదనలు సిద్ధం చేసిన క్రమంలో కేంద్ర నిధుల కోసం సమగ్ర నివేదిక తయారు చేయాలని రాష్ట్ర శాఖ ఆదేశించింది. దీంతో బాధ్యతలను ఓ ఏజెన్సీకి అప్పగించారు. సదరు మెగా టూరిజం సర్య్కూట్ పేరుతో సమగ్ర నివేదిక (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధం చేసి ఈ ఏడాది జూన్‌లో కేంద్రానికి పంపారు.
ప్రాజెక్టులోని అంశాలు...
ప్రాజెక్టులో భాగంగా సుమారు 10 లాంచీస్టేషన్లలో మౌలిక సదుపాయాలు, కొన్ని చోట్ల పార్కులు, రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేసేలా నివేదిక సిద్ధం చేశారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్ పరిధిలో లాంచీ స్టేషన్లయిన కూనవరం, శ్రీరాంగిరి, పోచవరంలో లాంచీల రాకపోకలకు వీలుగా బేస్‌క్యాంప్ ఏర్పాటు, మూడు ప్రాంతాల్లో పర్యాట కులు వేచి ఉండటానికి భవనాలు, భద్రాచలం దేవస్థానం సమీపంలో పోలవరం యాత్ర, ఇతర టూరిజం వివరాలను తెలియజేసేందుకు భారీ రిసెప్షన్ హాల్‌ను నిర్మించాలని నిర్ణయించారు. కేవలం ఖమ్మం జిల్లాలో గోదావరి తీరాన రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే జిల్లాలో రోడ్డుమార్గంలో చివరిన ఉన్న పేరంటాలపల్లి, ఖమ్మం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నదీ సరిహద్దులో ఉన్న కొల్లూరులో పర్యాటకులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుకు వీలుగా అక్కడి ఇసుక తిన్నెల్లో కుటీరాలు, ఇతర సౌకర్యాలను కల్పించనున్నారు. అలాగే ఉభయగోదావరి జిల్లాల్లోని ఐదు ప్రాంతాల్లో బేస్‌క్యాంప్‌లను ఇతర అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఇక్కడి 22 లాంచీల్లో అధికశాతం ప్రైవేటువారి చేతుల్లోనే ఉన్నాయి. అభివృద్ధి చెందితే పర్యాటకుల సంఖ్య పెరిగి ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని భావించారు.
చూపుతున్న సాకులివే...
సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్టును పూర్తిగా ఒకే రాష్ట్రానికి ఇస్తుంది. రాష్ర్ట విభజన జరిగినందున ఈ మెగా టూరిజం సర్క్యూట్ రెండు రాష్ట్రాల పరిధిలోకి వెళ్తుంది. సాంకేతికంగా ఇది సాధ్యం కాదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ విభజన కంటే ముందే నిధులు మంజూరు అయి, పనులు చేపడితే పూర్తి చేసే అవకాశం ఉండేది. కానీ కేంద్రం నిధులు మంజూరు చేయడంలో జాప్యం చేయడంతో పర్యాటక ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు పోలవరం ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తయితే ఖమ్మం జిల్లాలో టూరిజం సర్క్యూట్ నిష్ఫలంగా మారుతుంది. పోలవరం వల జిల్లాలో 154 ముంపు గ్రామాలుండగా, ఈ సర్క్యూట్‌లో నిర్మించే లాంచీ స్టేషన్లన్నీ ముంపునకు గురవుతాయి. దీంతో జిల్లాలో ప్రాజెక్టు కింద ఖర్చు పెట్టే రూ.15 కోట్ల నిధులు గోదావరి పాలుకానున్నాయి.