పర్యాటక అభివృద్ధికి కృషి చేయండి
పుట్టపర్తి టౌన్ : కేంద్ర పర్యాటక శాఖ తరఫున రాష్ట్రంలో రాయలసీమ టూరిజం సర్క్యూట్ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలని కేంద్ర టూరిజం శాఖ కార్యదర్శి సుమన్ బల్లాను రాష్ట్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోరారు. బెంగళూరు నుంచి సుమన్ బల్లా తన బృందంతో కలిసి శనివారం పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రశాంతి నిలయంలో వారికి పెనుకొండ ఆర్డీఓ రామమూర్తి, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన శాంతిభవన్ అతిథి గృహంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్‌జే రత్నాకర్‌రాజు, చక్రవర్తితో పుట్టపర్తి అభివృద్ధిపై చర్చించారు. అనంతరం వారు మంత్రితో కలిసి పుట్టపర్తిలోని పలు ప్రాంతాలు పరిశీలించారు.
ఈ సందర్భంగా శిల్పారామం కార్యాలయంలో సుమన్ బల్లా, రాష్ట్ర టూరిజం శాఖ అధికారులతో కలిసి చర్చించారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసిందని, ఇందులో రాయలసీమ టూరిజం సర్య్కూట్ అభివృద్ధికి సగం నిధులు వినియోగించే అవకాశం ఉందన్నారు. అనంతరం మంత్రి పల్లె మాట్లాడుతూ పుడా పరిధిలో థీంపార్కులు, సుందరవనాలు, ఎనుములపల్లి బోట్‌క్లబ్,శిల్పారామం రెండో విడత అభివృద్ధి తదితర పనులు చేపట్టాలని సూచించారు. త్వరితగతిన ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. కార్యక్రమంలో పుడా చైర్మన్ కడియాల సుధాకర్, రాష్ట్ర టూరిజం రీజనల్ డెరైక్టర్ గోపాల్, ఈడీ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, డీఎం సుదర్శనరావు పాల్గొన్నారు.