సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3,000 కోట్లు విడుదల చేయడానికి కేంద్ర జల వనరుల శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘నాబార్డు’ ద్వారా ఈ నిధులను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. మరో రూ.1,810.04 కోట్ల మంజూరుపై కసరత్తు చేస్తోంది. నిధుల వినియోగానికి సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లను(యూసీలు) ఎప్పటికప్పుడు పంపిస్తే, ప్రాజెక్టుకు వ్యయం చేసిన మొత్తాన్ని రీయింబర్స్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. గత ఏడాది జూలై 26న పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జల వనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది. 2014 ఏప్రిల్ 1వ తేదీకి ముందు పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన నిధులపై ఆడిట్ చేయించి, ఆడిటెడ్ స్టేట్‌మెంట్ పంపితే నిధులు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది.
కానీ, 2014 ఏప్రిల్ 1వ తేదీకి ముందు చేసిన వ్యయంపై ఆడిట్ చేయించడానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. 2014 ఏప్రిల్ 1కి ముందు సేకరించిన భూములను, ఆ తర్వాత అంటే 2014 ఏప్రిల్ 1 తర్వాత సేకరించినట్లు చూపి భారీ ఎత్తున ప్రజాధనాన్ని కాజేయడం వల్లే ఆడిట్ చేయించడానికి అప్పటి ప్రభుత్వ పెద్దలు అంగీకరించలేదు. కేంద్ర జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) పదేపదే ఒత్తిడి తేవడంతో వ్యయానికి సంబంధించిన ఆడిట్ స్టేట్‌మెంట్‌ను మాత్రమే రాష్ట్ర జలవనరుల శాఖ కేంద్రానికి పంపింది. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ అమలుకు 2014కు ముందు చేసిన వ్యయం రూ.1,397.19 కోట్లకు సంబంధించిన ఆడిట్ స్టేట్‌మెంట్‌ను పంపలేదు.. గత నెల 31న విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఇదే అంశాన్ని పీపీఏ సీఈవో ఆర్కే జైన్ లేవనెత్తారు. ఆడిట్ స్టేట్‌మెంట్‌ను పంపితేనే నిధులు విడుదల చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని తేల్చిచెప్పారు.
సీఎం వైఎస్ జగన్ సమీక్షతో కదలిక
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ నెల 3వ తేదీన సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై.. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. కేంద్రం గతేడాది జూలై 26 నుంచి నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని జలవనరుల శాఖ అధికారులను ప్రశ్నించారు. అధికారులు అసలు సంగతి బయటపెట్టడంతో కేంద్ర ప్రతిపాదన మేరకు తక్షణమే 2014 ఏప్రిల్ 1వ తేదీకి ముందు భూసేకరణ, సహాయ పునరావాస పనులకు చేసిన వ్యయంపై ఆడిట్ చేయించి, స్టేట్‌మెంట్ సిద్ధం చేసి పీపీఏ ద్వారా కేంద్ర జలవనరుల శాఖకు పంపాలని జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. దాంతో భూసేకరణ లెక్కలు తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఇదే సమాచారాన్ని పీపీఏకు చేరవేశారు. దాంతో పోలవరానికి తక్షణం రూ.3,000 కోట్లు విడుదల చేయాలంటూ కేంద్ర జలవనరుల శాఖకు పీపీఏ ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ప్రతిపాదించారు.
యూసీలు పంపితే నిధుల విడుదల
- పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై రూ.5,135.87 కోట్లు ఖర్చు చేసింది. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే సమయంలో.. 2014 ఏప్రిల్ 1 తర్వాత అంటే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని(జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయం మినహాయించి) మాత్రమే రీయింబర్స్ చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది.
- పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటిదాకా రూ.16,673.17 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. 2014 ఏప్రిల్ 1కి ముందు రూ.5,135.87 కోట్లను వ్యయం చేసింది. 2014 ఏప్రిల్ 1 తర్వాత రూ.11,535.30 కోట్లు ఖర్చు చేసింది.
- కేంద్రం పోలవరం ప్రాజెక్టు కోసం పీపీఏకు రూ.6,764.16 కోట్లు విడుదల చేసింది. (ఇందులో రూ.6,727.26 కోట్లను పోలవరం ప్రాజెక్టు పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది) మిగతా రూ.4,810.04 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
- యూసీలు పంపితే నిధులు విడుదలకు ప్రతిపాదనలు పంపుతామని పీపీఏ పేర్కొంది. దాంతో ఈ నెల 6న రాష్ట్ర ప్రభుత్వం రూ.3,000 కోట్లకు సంబంధించిన యూసీలను పీపీఏ ద్వారా కేంద్రానికి పంపింది.
- ఈ నెల 10న నిర్వహించిన డీడీఆర్‌పీ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలకు సంబంధించిన అంశంపై కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో చర్చించారు. యూసీలు పంపితే ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తామని కేంద్రం మరోసారి వెల్లడించింది.
ఢిల్లీకి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి సారించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌ను బుధవారం ఢిల్లీకి పంపారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ జారీ చేసిన పోలవరం ప్రాజెక్టు పనుల నిలిపివేత ఉత్తర్వుల సడలింపు గడువు జూలై 2తో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో పనుల నిలిపివేత ఉత్తర్వులను సడలించడం కాకుండా.. పూర్తిగా ఎత్తివేసేలా కేంద్ర అటవీ, పర్యావరణ, జలవనరుల శాఖ అధికారులతో చర్చించాలని ఆదిత్యనాథ్ దాస్‌కు సీఎం జగన్ సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు విడుదల చేయాల్సిన నిధులతోపాటు ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన(పీఎంకేఎస్‌వై) కింద రాష్ట్రానికి నిధులు విడుదల చేసే అంశంపై కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌తో గురువారం ఆదిత్యనాథ్ దాస్ చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment