పోలవరం అంచనా వ్యయం సవరణ రూ.47,725.74 కోట్లు | Revised cost estimate for Polavaram is Above Rs 47725 crore | Sakshi
Sakshi News home page

పోలవరం అంచనా వ్యయం సవరణ రూ.47,725.74 కోట్లు

Published Tue, Sep 22 2020 3:33 AM | Last Updated on Tue, Sep 22 2020 3:33 AM

Revised cost estimate for Polavaram is Above Rs 47725 crore - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం అంచనా వ్యయాన్ని 2017–18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్లకు సవరించేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై  సోమవారం ఆయన సంతకం చేసి కేంద్ర ఆర్థికశాఖకు పంపారు. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ), కేంద్ర ఆర్థిక శాఖ ఏర్పాటు చేసిన రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ కమిటీ(ఆర్‌ఈసీ) ఇప్పటికే అంచనా వ్యయాన్ని సవరించేందుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ ఫైలుపై  కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సంతకం చేయడం ఇక లాంఛనమే! వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం పనులపై నిపుణుల కమిటీ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంతో దర్యాప్తు జరిపించి టీడీపీ సర్కార్‌ అవినీతిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రక్షాళన చేశారు. ‘రివర్స్‌ టెండరింగ్‌’ ద్వారా ఇప్పటికే రూ.838 కోట్లను ఆదా చేశారు. ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ధృఢ సంకల్పం, చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్న నేపథ్యంలో అంచనా వ్యయం సవరించటాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

సవరించిన అంచనా ఇలా...
► కేంద్ర జల్‌శక్తి శాఖ ఆమోదించిన సవరించిన అంచనాల ప్రకారం పోలవరం హెడ్‌వర్క్స్‌ వ్యయం రూ.9,734.34 కోట్లు. కుడి కాలువ వ్యయం రూ.2,865.75 కోట్లు, ఎడమ కాలువ వ్యయం రూ.2,720.8 కోట్లు, భూసేకరణ, సహాయ పునరావాస(ఆర్‌ఆర్‌) ప్యాకేజీ వ్యయం రూ.28,172.21 కోట్లు, 960 మెగావాట్ల జలవిద్యుత్‌ కేంద్రం వ్యయం రూ.4,124.64 కోట్లు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) వ్యయం రూ.108 కోట్లుగా ఉంది. 
► 2010–11 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ వ్యయం పెరగడం.. నిర్వాసితులకు పునరావాసంకోసం ఆర్‌ అండ్‌ ఆర్‌ వ్యయం పెరగడంతో 2017–18 ధరల ప్రకారం అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లకు చేరుకుంది. కేంద్రం నుంచి ఇంకా రావాల్సింది రూ.29,521.70 కోట్లు. 

గత సర్కారు నిర్వాకాలతో...
► విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నాటి కేంద్ర మంత్రి మండలి బడ్జెట్‌ ద్వారా నిధులను కేటాయించి విడుదల చేయాలని 2014 మే 28న నిర్ణయం తీసుకుంది. పోలవరాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ను ఏర్పాటు చేసినా కమీషన్లకు కక్కుర్తిపడి, ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని 2016లో నాటి సీఎం చంద్రబాబు కోరారు. ఈ క్రమంలో 2017 సెప్టెంబరు 7న పోలవరం బాధ్యతను గత సర్కారుకు కేంద్రం అప్పగించింది. అయితే 2014 ఏప్రిల్‌ 1 తర్వాత పోలవరంలో నీటిపారుదల పనికి వ్యయం చేయాల్సిన నిధులను మాత్రమే ఇస్తామని మెలిక పెట్టింది. ఫలితంగా ఏప్రిల్‌ 1, 2014కు ముందు ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.5,135.87 కోట్లను కోల్పోవాల్సి వచ్చింది. జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టుకయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేంద్రం స్పష్టం చేసింది.
 
పారదర్శకత, చిత్తశుద్ధికి తార్కాణం..
► రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టును సాకారం చేసేందుకు 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. 2009 నాటికే కుడి, ఎడమ కాలువల పనుల్లో సింహభాగం పూర్తి చేశారు. హెడ్‌ వర్క్స్‌కు అవసరమైన భూసేకరణను కొలిక్కి తెచ్చారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించడం ద్వారా శరవేగంగా పూర్తి చేసే క్రమంలో మహానేత హఠాన్మరణం చెందారు. 
► విభజన నేపథ్యంలో జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని ప్రకటించిన కేంద్రం వంద శాతం వ్యయంతో తామే పూర్తి చేసి అప్పగిస్తామని చట్టంలో హామీ ఇచ్చింది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును అక్రమార్జనకు ఏటీఎంలా మార్చుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఇదే అంశాన్ని పలు సందర్భాల్లో ప్రస్తావించి చంద్రబాబు నైజాన్ని చాటారు.
► మార్చి 12, 2015న మొదటిసారిగా పీపీఏ సర్వసభ్య సమావేశంలో తాజా ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలు తక్షణమే అందజేయాలని గత సర్కారును నాటి పీపీఏ సీఈవో దినేష్‌కుమార్‌ ఆదేశించారు. 
► 2017–18 ధరల ప్రకారం రూ.57,940.86 కోట్లతో టీడీపీ సర్కారు పంపిన వ్యయ ప్రతిపాదనల్లో అక్రమాలను గుర్తించిన పీపీఏ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
► వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే పోలవరం పనులను ప్రక్షాళన చేసి శరవేగంగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. రివర్స్‌ టెండరింగ్‌తో అక్రమాలకు చెక్‌ పెట్టారు. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టడంతో జగ్‌మోహన్‌ గుప్తా నేతృత్వంలో కేంద్రం ఏర్పాటు చేసిన ఆర్‌ఈసీ పోలవరం అంచనా వ్యయాన్ని రూ.47,725.74 కోట్లుగా ఖరారు చేసి కేంద్ర జల్‌ శక్తి శాఖకు పంపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement