పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా కేంద్రీయ విద్యాలయ పరిస్థితి ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయం రేకులషెడ్డులో నడుస్తోంది. రాష్ట్రప్రభుత్వం 9 ఎకరాల స్థలం, కేంద్రం రూ.10.86 కోట్ల నిధులు విడుదల చేసినా సొంత భవనాలకు నోచుకోలేదు. ఈ దుస్థితి నెల్లూరు నగరంలోని కేంద్రీయ విద్యాలయంలో నెలకొంది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే కేంద్రీయ విద్యాలయానికి సొంత భవనాలు ఒనగూరడం పెద్ద సమస్య కాదు.
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయ ప్రస్తుతం రేకుల షెడ్డులో నడుస్తోంది. కేంద్రీయ విద్యాలయకు జిల్లా అధికారులు 9 ఎకరాల స్థలం కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం రూ.10.86 కోట్లు నిధులు భవ నిర్మాణాల కోసం విడుదల చేసింది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అనే చందంగా ప్రస్తుతం కేం ద్రీయ విద్యాలయ విద్యార్థులు, ఉపాధ్యాయు లు ఆర్‌ఎస్‌ఆర్ మున్సిపల్ హైస్కూలు ప్రాంగణంలో అరువుకు తీసుకున్న రేకుల షెడ్డులో కాలం వెళ్లదీస్తున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేందుకు ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయాన్ని జిల్లా కేంద్రమైన నెల్లూరులో 2010, సెప్టెంబర్‌లో నెలకొల్పారు. వెంకటగిరిలో ఒక కేంద్రీయ విద్యాలయం ఉన్నప్పటికీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి నిరంతర కృషితో నెల్లూరుకు మరో కేంద్రాన్ని తీసుకురాగలిగారు. ఈ కేంద్రాన్ని ఆయన స్వయంగా ప్రారంభించారు. ఆ విద్యాలయం రేకుల షెడ్డులో నడుస్తుండటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
ఎంపీ రాజమోహన్‌రెడ్డి నాటి కలెక్టర్ రాంగోపాల్‌తో మాట్లాడి స్థల సేకరణకు అవసరమైన సహాయ సహకారాలు అందించారు. అలాగే రూ.10.86 కోట్ల నిధులు భవన నిర్మాణానికి సాధించారు. మూడేళ్లు అవుతున్నా అధికారుల అలసత్వం వల్ల కేంద్రీయ విద్యాలయానికి సొంత భవనాలు సమకూరలేదు. కేంద్రీయ విద్యాలయ విద్యా విధానానికి అనుగుణంగా విశాలమైన ప్రాంగణంలో, సువిశాలమైన, పటిష్టమైన అన్ని హంగులు కలిగిన భవనం ఉండాలనే ఉద్దేశంతో సుమారు రూ.11 కోట్లు వ్యయంతో నిర్మించేందుకు అనుకూలమైన స్థలాన్ని జిల్లా యంత్రాంగం కేటాయించింది. కొత్తూరు పంచాయతీ బిట్-1 పరిధిలోని సర్వే నం.2103లో 9 ఎకరాల స్థలాన్ని కేంద్రీయ విద్యాలయానికి కేటాయించారు. ఈ స్థలానికి ఒక వైపు హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉండటంతో సమస్య తలెత్తింది.
ఈ వైర్ల వల్ల ప్రమాదమే కాకుండా వాటి నుంచి వెలువడే శక్తి తరంగాలు విద్యార్థుల మెదడుపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు హెచ్చరించారు. దీంతో మరో ప్రాంతంలో భూమి కేటాయించాలని అధికారులు భావించారు. అయితే నగరానికి సమీపంలో ఒకే ప్రాంతంలో ప్రభుత్వ స్థలం ఎక్కువగా లేకపోవడంతో ముందు కేటాయించిన స్థలంలోనే విద్యుత్ తీగలు ఉండే ప్రాంతాన్ని మినహాయించి 7.35 ఎకరాలను కేటాయించారు. ఈ స్థలంలో ప్రస్తుతం ప్రహరీ నిర్మాణం జరుగుతోంది. విజయవాడకు చెందిన అభి కనస్ట్రక్షన్స్ వారు ప్రస్తుతానికి ప్రహరీ వరకే నిర్మించి మలివిడతలో భవన నిర్మాణాలు చేపడతారని తెలిసింది. ఈ భవన నిర్మాణాలు ప్రారంభించేదెప్పుడు, పూర్తియి అక్కడ తరగతులు నిర్వహించేదెప్పుడని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రీయ విద్యా విధానమే వేరు
కేంద్రీయ విద్యాలయ విద్యా విధానం ప్రత్యేకంగా ఉంటుంది. బోధన ప్రణాళిక, పాఠశాల సమయం, ప్రార్థన విధానం , వేసవి సెలవు సమయం..ఇలా అన్నీ సాధారణ పాఠశాలకు భిన్నంగా ఉంటాయి. 2010లో నెల్లూరులో విద్యాలయ ప్రారంభించినప్పుడు కేవలం 1 నుంచి 5 తరగతుల వరకు నిర్వహించేవారు. ప్రస్తుతం 8వ తరగతి వరకు నిర్వహిస్తున్నారు. మూడేళ్ల క్రితం 5వ తరగతి ఉన్న విద్యార్థి తర్వాత ఏడాది 6, ఆ తర్వాత 7, ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నారు. ప్రతి ఏడాది ఒక తరగతిలో కేవలం 40 మందికి మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. బదిలీపై వచ్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా రక్షణ రంగానికి చెందిన వారి పిల్లలు, ఇతర కేంద్రీయ విద్యాలయాల నుంచి పిల్లలకు కచ్చితంగా ప్రవేశం కల్పించాల్సి ఉంటుంది. సాధారణ ప్రవేశాల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5శాతం, ఎంపీ కోటా కింద 6 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. 200 మంది విద్యార్థులలో ప్రారంభమైన విద్యాలయంలో ప్రస్తుతం 356 మంది ఉన్నారు.
ఫీజు వసూళ్లలో త్రైమాసిక విధానం
ఇక్కడ మూడు నెలలకొకసారి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 1,2 తరగతులకు మూడు నెలలకు రూ.1500 చెల్లించాలి. 3 నుంచి 8వ తరగతి వరకు మూడు నెలలకు రూ.1800 వసూలు చేస్తారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి భోజనం రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. కాని కంప్యూటర్ ఫీజు మాత్రం మూడు నెలలకు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. కేంద్రీయ విద్యాలయంలో ఏప్రిల్ 1 నుంచి మార్చి 31వరకు విద్యా సంవత్సరంగా పరిగణిస్తారు. మే, జూన్ మాసాల్లో 50 రోజుల పాటు వేసవి సెలువులు ప్రకటిస్తారు. సాధారణ దినాల్లో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2.40 గంటల వరకు పాఠశాల నిర్వహిస్తారు. కేంద్రీయ విద్యాలయకు ప్రత్యేక ప్రార్థనా గీతం ఉంటుంది. ఉదయం పాఠశాల ప్రారంభమైనప్పుడు, తిరిగి ఇంటికి వెళ్లేప్పుడు విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద పెద్ద వాయిద్యాలతో మైకుల ద్వారా ప్రార్థనా గీతాన్ని ఆలపించడం విశేషం.
రేకుల షెడ్డులో కేంద్రీయం
Published Thu, Dec 12 2013 4:24 AM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM
Advertisement
Advertisement