
ఒక్క ఓటు తొలగించాలన్నా కలెక్టర్, ఎన్నికల సంఘం అనుమతి తప్పకుండా ఉండాలి.
సాక్షి, అమరావతి: రానున్న సార్వత్రిక, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించడానికి వెబ్ కాస్టింగ్ పెడుతున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అదికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఓటర్ల జాబితాలో నకిలీ, డబుల్ ఎంట్రీ ఓటర్లను తొలగిస్తున్నామన్నారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ జాబితాలో అవకతవకలు జరిగాయన్న రాజకీయ పార్టీల ఫిర్యాదులపై మూడు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలలో అధికారులు తనిఖీలు చేశారన్నారు.
ఒక్క ఓటు తొలగించాలన్నా కలెక్టర్, ఎన్నికల సంఘం అనుమతి తప్పకుండా ఉండాలన్నారు. సుమోటోగా ఓట్లను తొలగించడానికి వీల్లేదని అధికారులకు సూచించారు. నకిలీ ఓటర్లను తొలగిస్తామని, అయితే దానికి కాస్త సమయం కావాలన్నారు. ఇప్పటికే ఓటర్ జాబితాలో పొరపాట్లను గుర్తించామని, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఇక ఎమ్మెల్సీ ఓటర్ జాబితా సిద్దమైందని అయితే.. ఎమ్మెల్యే కోటా ఎన్నికలకు ఎలక్షన్ కోడ్ వర్తించదన్నారు. పట్టభద్రుల, టీచర్ల ఎన్నికలకు పాక్షికంగా ఎన్నికల కోడ్ వర్తిస్తుందని ఆయన తెలిపారు.