కాకినాడ సభలో ప్రసంగిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు
సాక్షి, కాకినాడ సిటీ: కార్యకర్తలకు దిశానిర్దేశం పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం సాయంత్రం కాకినాడలో నిర్వహించిన సభ ఆద్యంతం స్వోత్కర్ష.. పరనింద అన్న రీతిలో సాగింది. స్థానిక విద్యుత్ నగర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన వచ్చింది మొదలు.. మాట్లాడిన 46 నిమిషాలూ మోదీ, జగన్, కేసీఆర్, సాక్షి దినపత్రికలను విమర్శించడం తప్ప టీడీపీ కార్యకర్తల గురించి కానీ, పేదల సంక్షేమం గురించి కానీ మాట్లాడలేదు.
తాను చేసిన పనులపై సొంతడబ్బా కొట్టుకోవడంతోనే కార్యక్రమం ముగిసిపోయింది. దీంతో సభకు వచ్చిన కార్యకర్తలు, నాయకుల్లో విసుగు కనిపించింది. ‘‘మధ్యాహ్నం 2 గంటలకు వచ్చాం. ఇక్కడ ఏముంది? టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు ఇచ్చిన భరోసా ఏమిటి? ఏం మాట్లాడారు?’’ అంటూ కొందరు కార్యకర్తలు గుసగుసలాడుకున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత 98 లక్షల మంది డ్వాక్రా గ్రూపు మహిళలతో బలమైన సైన్యం ఏర్పాటు చేసుకున్నానని, వారితోనే ఎన్నికలు జరిపిస్తున్నానని, భర్తలు వారి మాట వినకపోతే తమ తోవలోకి తీసుకువస్తారని చంద్రబాబు ప్రకటించడం సభికులను ఆశ్చర్యచకితులను చేసింది.
జిల్లాలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలు, 4 పార్లమెంటు సీట్లనూ గెలుస్తామని పదేపదే చెప్పారు. దీంతో ‘మూడు పార్లమెంట్లే’నంటూ కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. పాడేరు పార్లమెంట్‌లోని ఓ నియోజకవర్గం కూడా ఈ జిల్లాలో ఉందని సమర్థించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా మళ్లీ ‘నాలుగు పార్లమెంట్లూ మనం గెలవాలం’టూ కార్యకర్తలతో చెప్పించడంతో సభికులు నవ్వుకున్నారు. మోదీ మోసం చేశారని, రాష్ట్రానికి మట్టి, నీరు తప్ప ఏమీ ఇవ్వలేదని అన్నారు. డ్వాక్రా మహిళలు, సాధికార మిత్రలు, వివిధ సంఘాలకు చెందిన నాయకులు.. ఇలా కోటీ 50 లక్షల సైన్యం తమకుందని అన్నారు. చంద్రబాబు రూ.వెయ్యి నిరుద్యోగ భృతి ఇస్తుండగా.. ఈ సమావేశంలో రూ.2 వేలు ఇస్తున్నట్లు చెప్పడంపై సభలో గుసగుసలు వినిపించాయి.
‘‘డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ, పసుపు కుంకుమ ఇచ్చామా లేదా?’’ అంటూ కార్యకర్తలతో పదేపదే చెప్పించుకున్నారు. చంద్రబాబు వచ్చేవరకూ కార్యకర్తలు రాకపోవడంతో సభా ప్రాంగణమంతా ఖాళీగా దర్శనమిచ్చింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలను, వృద్ధులను బస్సులపై తరలించడం, కిలోమీటర్ల దూరంలో పోలీసులు వాటిని నిలిపివేయడంతో సమావేశం జరిగే ప్రాంతానికి రావడానికి వారు అష్టకష్టాలు పడ్డారు. టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు ఇచ్చిన ఊకదంపుడు ఉపన్యాసాలతో వచ్చిన కార్యకర్తలు విసుగు చెందడం కనిపించింది. చంద్రబాబు వస్తే వెళ్లిపోవచ్చని కొందరు కార్యకర్తలు అనుకుని, సభా ప్రాంగణానికి రాకుండా చెట్టుపుట్టల వైపు వెళ్లి కూర్చున్నారు. కొందరైతే సభకు రాకుండానే తిరుగు పయనమయ్యారు. ఈ సమావేశంలో జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment