సాక్షి ప్రతినిధి, కాకినాడ: జనసేనాని పవన్‌కళ్యాణ్ పొత్తుల వ్యాఖ్యలు గోదావరి జిల్లాల్లో ఆ పార్టీ శ్రేణుల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. పవన్‌ని నమ్ముకొని పదేళ్లుగా పార్టీనే అంటిబెట్టుకుని ఉన్న ఆశావహులు మొదలు ద్వితీయ శ్రేణి నేతలు సైతం పవన్ తీరుతో రగిలిపోతున్నారు. ఇన్నేళ్లుగా వెంట ఉన్నది చంద్రబాబు పల్లకీ మోయడానికా అంటూ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. రాజకీయ భవిష్యత్‌పై తాము పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లేశారని మండిపడుతున్నారు.
పవన్ పొత్తులు, సీఎంపై ఆశలు లేవు వంటి వ్యాఖ్యలపై ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని జనసేన నేతలు, కార్యకర్తలతోపాటు పవన్ సామాజికవర్గ యువత సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోస్తున్నారు. పదేళ్లుగా పార్టీని బలోపేతం చేయకుండా ఇంకా బలహీనంగానే ఉన్నామని చెప్పడం, వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలతో కలిసే వెళదామనడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి అన్ని రకాలుగా నష్టపోయిన నేతలు ఇప్పుడు పొత్తులు తప్పవని పవన్ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా కుదేలైపోయారు. పార్టీలో కొనసాగడమా లేక ప్రత్యామ్నాయం ఆలోచించాలా అని జనసేన ముఖ్య నేతలు తర్జనభర్జన పడుతున్నారు.
ఉన్నది ఉభయ గోదావరి జిల్లాల్లోనే..
జనసేన పార్టీకి కొద్దోగొప్పో ఆదరణ ఉన్నది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే బాహాటంగా చెబుతుంటారు. పవన్ పొత్తులు తట్టుకోలేమంటూ ఈ జిల్లాల్లోని జనసేన అభిమానులు గురు, శుక్రవారాల్లో పెడుతున్న పోస్టింగ్‌లు ఆ పార్టీలో కాకపుట్టిస్తున్నాయి. చంద్రబాబుని నమ్మొద్దని వాటిలో నేరుగా కోరుతున్నారు. ‘మనల్ని ఎవడ్రా ఆపేది.. మనల్ని ఎవడ్రా ఆపేది అంటుంటే ఏమో అనుకున్నాం. అన్నయ్యా, మమ్మల్ని నువ్వే ఆపేది అని అర్థమైంది’, ‘ఎవరినో సీఎంను చేయడానికి మేము సిద్ధంగా లేం. పది సంవత్సరాలుగా జనసేన జెండా మోస్తున్నాం. కొత్తగా మరో జెండా మోయడం మావల్ల కాదు’ అంటూ పలు రకాలుగా జనసేన కార్యకర్తలు, పవన్ సామాజికవర్గ నేతలు, యువత నిప్పులు చెరుగుతున్నారు. ఆరేళ్ల కిందట కాపులపై చంద్రబాబు జరిపిన దమనకాండ మరిచిపోమ్మంటే ఎలా అని ప్రశి్నస్తున్నారు.
చేగొండి సహా అనేకమంది మండిపాటు..
గోదావరి జిల్లాల్లో ఆ సామాజికవర్గానికి చెందిన వృద్థతరం నేత చేగొండి హరిరామజోగయ్య సామాజిక మాధ్యమాలలో ఇదే అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం. ‘పవన్‌కళ్యాణ్ కాపులకు నాయకుడిగా ఉంటాడని ఆశించాను. కానీ ఆయన మరొక్కసారి వేరే వారి పల్లకీ మోస్తాననడం సమంజసం కాదు. ‘నా అనుభవం రీత్యా చెబుతున్నాను. మరొక్కసారి ఇతర పార్టీల జెండా, అజెండాలను మోసే స్థాయిలో కాపు సామాజికవర్గం లేదు. పవన్ సీఎం అవుతానంటేనే ఇంతకు ముందు సమర్థించాను’ అని జోగయ్య ప్రతిస్పందించారు. ఆయనతోపాటు కాపు సామాజికవర్గంలో పలువురు ఇదే విధంగా వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేని పవన్ సినీ అభిమానులు సైతం పవన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.
ఈ దమనకాండ బాబు చేసిందే..
బీసీ రిజర్వేషన్ల కోసం కాపు సామాజికవర్గం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమం గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున జరిగింది. ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, కుటుంబ సభ్యుల పైన, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆ సామాజికవర్గంపైన అధికారం ఉందనే ధీమాతో చంద్రబాబు కక్షకట్టి ఉక్కుపాదం మోపి ఉద్యమాన్ని అణగదొక్కేసిన విషయం, అక్రమంగా పెట్టిన కేసులు గుర్తు లేదా అని పవన్‌ను ప్రశి్నస్తున్నారు. చంద్రబాబు, పవన్ సామాజికవర్గాల మధ్య వైరం ఈనాటిది కాదు. కాపు ఉద్యమం సందర్భంగా కోనసీమ సహా పలు ప్రాంతాల్లో ఆ సామాజికవర్గీయులలో మహిళలపైన కూడా చంద్రబాబు అండ్ కో కేసులు పెట్టించి వేదించింది. అవన్నీ మరిచిపోయి ఇప్పుడు తెలుగుదేశం పారీ్టతో పొత్తు పెట్టుకుంటామంటే ఎందుకు ఆయన వెంట నిలబడాలని ఆ సామాజికవర్గ నేతలు నిలదీస్తున్నారు.
ఇది కూడా చదవండి: జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు ఖాయం
Comments
Please login to add a commentAdd a comment