ఆదమరిస్తే లాగేస్తారు!
ఆదమరిస్తే అంతే సంగతులు. ఉదయం గుడికి వెళ్తున్నప్పుడైనా.. సాయంత్రం వాకింగ్ చేసేటప్పుడైనా.. ఇంటి వద్దకొచ్చి అడ్రస్ చెప్పమని అడుగుతూ... ఇలా సందర్భమేదైనా ఏమరపాటుగా ఉంటే మెడలోని గొలుసులు తెంపుకుని వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా మధ్య వయసు, వృద్ధ మహిళలే లక్ష్యంగా గొలుసు దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. విలాస జీవితానికి అలవాటు పడిన యువకులు, విద్యార్థులు సులువుగా డబ్బు సంపాదించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు.
- మళ్లీ గొలుసు దొంగతనాల జోరు
- మధ్య వయస్కులు, వృద్ధ మహిళలే టార్గెట్
- ప్రకటనలకే పోలీసులు పరిమితం
నగరంలో ఇటీవల చెయిన్ స్నాచింగ్ సంఘటనలు ఎక్కువయ్యాయి. సులువుగా దొంగతనం చేసే మార్గం కావడంతో యువకులు ఎక్కువగా ఈ తరహా చోరీలకు పాల్పడుతున్నారు. బాధితుల్లో చాలా మంది ఫిర్యాదు చేయకపోవడం, ఫిర్యాదు చేసినా నేరస్తుడిని గుర్తించడం ఒకింత కష్టం కావడంతో వీరికి శిక్షలు పడుతున్న దాఖలాలు కూడా లేవు. పోలీసులు కూడా చెయిన్ స్నాచింగ్‌ను పెద్దగా సీరియస్‌గా తీసుకోకపోవడం దొంగలకు వరంగా మారింది.
ఎక్కువగా యువకులే ఈ నేరానికి పాల్పడుతుండడంతో గతంలో ఇక్కడ పోలీసు కమిషనర్‌గా పనిచేసిన సాంబశివరావు.. నిందితుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. నగరంలోని పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్ధులు చెయిన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారని పరిశీలనలో తేలడంతో పోలీస్ కమిషనర్ పూర్ణచంద్రరావు హయాంలో వారిపై దృష్టి పెట్టారు. అయినా పెద్దగా ఫలితం కనిపించలేదు. 2014లో మాత్రం గొలుసు దొంగతనాల్లో రాటుదేలిన ఇద్దరిని టాస్క్‌ఫోర్సు పోలీసులు పట్టుకొని, వారి వద్ద 420 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వీరిపై 17 కేసులున్నాయి. ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనలతో మహిళలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. బంటరిగా ఉన్న వృద్ధులను ఇంట్లో వదిలివెళ్లాలంటే కుటుంబ సభ్యులు కూడా భీతిల్లుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు చెయిన్ స్నాచింగ్‌ను తేలికగా తీసుకోకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని బాధితులు కోరుతున్నారు.
- ఎంవీపీ సెక్టార్-6లోని రాజీవ్ పార్కు సమీపంలో.. గత సోమవారం సాయంత్రం ఇద్దరు యువకులు ఒక మహిళ మెడలో గొలుసును లాక్కుపోయారు.
- గత ఏడాది ఆరిలోవలో గుడి నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఓ వృద్ధ మహిళ మెడలోని మూడు తులాల బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన యువకులు దొంగిలించారు.