టీడీపీ నేతల మధ్య చైర్ వార్!
► తిరువూరు నగర పంచాయతీ చైర్ పర్సన్ మార్పుపై రగడ
► టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో గొడవకు దిగిన ఓ వర్గం
► ఒప్పందం అమలు చేయకపోతే ఆత్మాహుతికి సిద్ధమని హెచ్చరిక
► పెట్రోల్, కిరోసిన్ సీసాలతో సమావేశానికి వచ్చిన వైనం
► తిరువూరు చైర్‌పర్సన్ మార్పుపై టీడీపీలో కుమ్ములాటలు
తిరువూరు నగర పంచాయతీలో అధికార టీడీపీ నేతల మధ్య ‘చైర్ వార్’ తారస్థాయికి చేరింది. చైర్‌పర్సన్ మార్పు విషయంలో ఒప్పందం అమలు చేయాలని ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. తాత్సారం చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని ఆ వర్గ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు టీడీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జి స్వామిదాసు ఇంట్లో శనివారం జరిగిన సమన్వయ కమిటీ సమావేశానికి కొందరు కార్యకర్తలు పెట్రోలు, కిరోసిన్ సీసాలతో రావడం కలకలం రేపింది. వారంలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని స్వామిదాసు చెప్పడంతో అంతా శాంతించారు.
తిరువూరు : స్థానిక నగర పంచాయతీ చైర్‌పర్సన్ మార్పు విషయం అధికార పార్టీలో చిచ్చురేపింది. ఒప్పందం ప్రకారం పదవి ఇవ్వకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని ఓ వర్గం హెచ్చరిస్తోంది. రేపు... మాపు.. అంటూ మరో వర్గం ఆరు నెలలుగా కాలం వెల్లదీస్తోంది. దీంతో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి స్వామిదాసు ఇంట్లో శనివారం జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తొలుత కుదిరిన ఒప్పందం మేరకు తిరువూరు నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ను మార్పు చేయాలని పట్టుబట్టారు. ఈ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ఒకటో వార్డు కౌన్సిలర్ మోదుగు రాజకుమారి అనుచరులు, కొందరు మహిళలు వచ్చి చైర్‌పర్సన్ మార్పు గురించి ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని స్వామిదాసును నిలదీశారు.
ఈ విషయంలో తనకేమీ అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. అయితే, ఏఎంసీ చైర్మన్ తాళ్లూరి రామారావు తన నిర్ణయం తెలియజేయడానికి జాప్యం చేస్తున్నారని స్వామిదాసు చెప్పడంతో... జెడ్పీటీసీ మాజీ సభ్యులు గద్దె రమణ, టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు బొబ్బా కుమార్, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి మోదుగు వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సమన్వయ కమిటీలో నిర్ణయం తీసుకోకుండానే అధిష్టానం చెప్పాలని దాటవేయడమే కాక, ఇప్పుడు ఒకరిద్దరి నిర్ణయంపై ఆధారపడి చైర్‌పర్సన్ మార్పు అంశం పరిశీలిస్తామనడం తగదని వారు మండిపడ్డారు.
నేతల మధ్య వాగ్యుద్ధం
విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇటీవల నగర పంచాయతీ చైర్‌పర్సన్ మార్పు అంశాన్ని టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌కు వివరించారని, త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామన్నారని స్వామిదాసు చెప్పారు. అయితే, తాను కూడా పార్టీ సమావేశాల్లో పలు సమస్యలపై మాట్లాడాలని నిర్ణయించుకున్నానని, కేవలం నగర పంచాయతీ సమస్యనే భూతద్దంలో చూపవద్దని ఏఎంసీ చైర్మన్ తాళ్లూరి రామారావు చెప్పడంతో కొద్దిసేపు నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం సాగింది.
ఒప్పందం అమలుచేయకపోతే ఆత్మాహుతే...
మున్సిపల్ ఎన్నికల సమయంలో సమన్వయ కమిటీ సభ్యుల సమక్షంలో జరిగిన ఒప్పందాన్ని అమలు చేయడానికి ఆరు నెలలుగా ఎందుకు తాత్సారం చేస్తున్నారని అసమ్మతివర్గ నాయకులు అందరూ స్వామిదాసును నిలదీశారు. చైర్‌పర్సన్ మార్పు ఉందా... లేదా.. అనే విషయం తేల్చి చెప్పాలని, ఆ తర్వాత తాము భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామని హెచ్చరించారు. చైర్‌పర్సన్ కృష్ణకుమారిని తొలగించకపోతే తాము ఆత్మాహుతికి పాల్పడతామని పలువురు కార్యకర్తలు తమ వెంట తెచ్చుకున్న పెట్రోలు సీసాలు చూపించారు.
దీంతో సమావేశంలో ఒక్కసారిగా కలకలం రేగింది. వారంరోజుల్లో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకుంటామని స్వామిదాసు, డీసీఎంఎస్ డైరెక్టర్ చెరుకూరి రాజేశ్వరరావు చెప్పడంతో అసమ్మతి వర్గీయులు శాంతించారు. మరోవైపు ఈ సమావేశానికి పలువురు మండల పరిషత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు గైర్హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది.