పెనుకొండ: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల వర్గపోరు తారస్థాయికి చేరింది. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట చేపట్టిన బస్సుయాత్ర సందర్భంగా ఆదివారం మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, పార్టీ నాయకురాలు సవితమ్మ వర్గీయులు పెనుకొండ పట్టణంలో బాహాబాహీకి దిగారు. నడిరోడ్డుపైనే తన్నుకున్నారు. బస్సుయాత్ర ఆదివారం శెట్టిపల్లి నుంచి వివిధ గ్రామాల మీదుగా పెనుకొండకు చేరుకుంది.
స్థానిక మడకశిర సర్కిల్లోని ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాల వేయడానికి ముందు సమీపంలోని టీడీపీ కార్యాలయం వద్ద సవితమ్మ వర్గీయులు బాణాసంచా కాలుస్తూ కేకలు వేశారు. దీంతో ఆగ్రహానికి లోనైన బీకే పార్థసారథి.. సవితమ్మ వర్గీయులను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ‘పోటు పొడిచారు.. మీ కథ చూస్తా..’ అంటూ హెచ్చరించారు. బస్సుయాత్రలో వెనుకనే ఉండి డ్రామాలాడుతోందంటూ సవితమ్మపై పరోక్షంగా మండిపడ్డారు.
అనంతరం పార్టీ జిల్లా నేతలు ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేయడానికి పైకి వెళ్లగానే.. బస్సు ముందు నిలబడి ఉన్న ఇరువర్గాలు కేకలు వేస్తూ బాహాబాహీకి దిగారు. గందరగోళం నెలకొంది. ఏం జరుగుతోందో అర్థంగాక కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అక్కడి నుంచి బస్సుయాత్ర అంబేడ్కర్ సర్కిల్‌కు వెళ్లగా సవితమ్మ వర్గీయులు మాత్రం కార్యాలయం వద్దే ఉండిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment