ఇప్పటిదాకా ఒక లెక్క. ఈసారి మాత్రం ఓ లెక్క. హిందూపురం కంచుకోటను బద్ధలు కొట్టి టీడీపీని ఓడించేందుకు వైఎస్సార్‌సీపీ ఇప్పటికే వ్యూహం సిద్ధం చేసింది. సామాజిక సమీకరణాల్లో భాగంగా దీపికకు సీటు కేటాయించింది. తద్వారా గత ఐదేళ్లలో మొక్కుబడిగా నియోజకవర్గాన్ని సందర్శిస్తున్న నందమూరి బాలకృష్ణకు చెక్ పెట్టడానికి రంగం సిద్ధం చేసింది. అయితే నామినేషన్ల పర్వం దగ్గర పడింది కదా!. బహుశా అందుకేనేమో షూటింగ్‌కు బాలయ్య పేకప్ చెప్పినట్లున్నారు.
ప్చ్.. హిందూపురంలో ఈసారి బాలయ్య గెలుపు కష్టమే. టీడీపీ తమ కంచుకోటగా భావిస్తూ వస్తున్న హిందూపురం నియోజకవర్గంలో.. అదీ టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తున్న బలంగా వినిపిస్తున్న టాక్ ఇదే. ఈ నేపథ్యంలో.. శనివారం నుంచి కదిరి నుంచి ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో ఎన్నికల ప్రచారానికి బాలయ్య సిద్ధపడుతున్నారు. పనిలో పనిగా.. ఎన్డీయే అభ్యర్థుల విజయం కోసం రాయలసీమలో ఆయన విస్తృతంగా పర్యటిస్తారట. విశేషం ఏంటంటే.. ‘బాలయ్య అన్‌స్టాపబుల్’ పేరుతో ఇందుకోసం ప్రత్యేకంగా ఓ బస్సును కూడా రూపొందించారు. ఆ బస్సు గురించి చివర్లో ఓ ముచ్చట చెప్పుకుందాం.
అది ఎన్టీఆర్ క్రేజ్ వల్లే..
హిందూపురం.. ఈ సీటు నుంచే స్వర్గీయ నందమూరి తారక రామారావు 1985లో తొలిసారి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 1998లో మరోసారి గెలిచారు. 1994లో మూడవసారి గెలిచి 1996లో మరణించేటంతవరకూ కొనసాగారు. అంటే.. పదకొండేళ్ల పాటు ఏకధాటిగా హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆయన మరణించాక జరిగిన ఉప ఎన్నికలో అదే సీటు నుంచి ఆయన తనయుడు నందమూరి హరికృష్ణ గెలిచారు ఆయన 1999 దాకా దాదాపుగా మూడున్నరేళ్ల పాటు పనిచేశారు. ఆ తర్వాత 1999, 2004, 2009 ఎన్నికల్లోనూ అక్కడ వరుసగా టీడీపీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. అయితే..
రాష్ట్ర విభజన నేపథ్యంలో..
రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారం చేజిక్కించుకుంది. ఆ సమయంలో హిందూపురం నుంచి పోటీ చేసి బాలయ్య ఎమ్మెల్యేగా తొలిసారి నెగ్గారు. అయితే..ఆ సమయంలో బాలయ్య 16 వేల ఓట్ల తేడాతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై గెలిచారు. ఇక రెండోసారి 2019 ఎన్నికల్లోనూ 18 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. రెండు ఎన్నికల్లోనూ పది శాతం ఓట్ల తేడాతో బాలయ్య నెగ్గారు. ఈ రెండుసార్లూ కాంగ్రెస్, జనసేన అభ్యర్థుల కారణంగా ఓట్లు చీల్చాయి. అంటే.. ఏ లెక్కన చూసుకున్నా బాలయ్య ‘అఖండ’ మెజారిటీ ఏం గెలవలేదు. పైగా ఈసారి బాలయ్యపై వ్యతిరేకతకు అదనంగా.. సీఎం జగన్ సంక్షేమ పాలన పట్ల ప్రజల్లో ఆదరణ, రాయలసీమ ఎన్నికల బాధ్యతలు మంత్రి పెద్దిరెడ్డి తీసుకోవడంతో.. బాలయ్యకు హిందూపురంలో ఈసారి టీడీపీకి గడ్డు పరిస్థితే ఎదురుకావొచ్చనే చర్చా బాగా నడుస్తోంది.
దూరం దూరం.. పీఏల యవ్వారం!
అభివృద్ధి పనులా?.. హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే హోదాలో నందమూరి బాలకృష్ణ సందర్శించింది వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. షూటింగ్‌ల బిజీలతోనే ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలోనే మా ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ పోస్టర్లు, దున్నపోతుల మీద బాలయ్య పేర్లు రాసి ధర్నాలు నిర్వహించేదాకా పరిస్థితి వెళ్లింది. మొదటి దఫాగా గెలిచిన సమయంలోనే కాదు.. ప్రతిపక్ష హోదాలో రెండోసారి కూడా అదే తీరును బాలయ్య కనబరుస్తూ వచ్చారు. అందుకే అక్కడి ప్రజల్లో ఆయన తీరుపై వ్యతిరేకత బలంగా ఉంది. అంతెందుకు.. ఇప్పుడు ఆయన చేపడుతున్న బస్సు యాత్ర హడావిడి కూడా.. ఎన్నికల నేపథ్యంలోనే అదీ సుదీర్ఘకాలం పది నెలల తర్వాత ఆయన మళ్లీ నియోజకవర్గం వైపు అడుగులేయిస్తోన్నదే. వీటన్నింటికి తోడు ఆయన పీఏలపై వచ్చిన ఆరోపణలు ఆయన ఇమేజ్‌ను మరింత పల్చన చేశాయి.
గతంలో హిందూపురంలో బాలయ్య తీరుకు నిరసనగా సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులు
అభిమానులు జర జాగ్రత్త!
నెలల తరబడి నియోజకవర్గంలో బాలకృష్ణ కానరాక టీడీపీ కార్యకర్తల్లో నిరుత్సాహం పేరుకుపోయి ఉంది. ఇప్పుడు ఎట్టకేలకు ఆయన పర్యటన ఖరారైంది. ఎమ్మెల్యే నియోజకవర్గానికి వస్తున్నారన్న సమాచారంతో టీడీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ, బాలయ్య ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతీసారి జరుగుతున్న చమక్కులు చూస్తున్నదే. అభిమానులు, కార్యకర్తలతో బాలయ్య వ్యవహరించే తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానుల్ని నెట్టేయడం, కుదిరితే కొట్టడం.. దానిని ‘ప్రేమ’ అంటూ ప్రచారం చేసే ఎల్లో సోషల్ మీడియా పేజీలు, అభిమాన సంఘాలు అబ్బో.. ఈసారి కూడా సోషల్ మీడియా ఆ స్టఫ్‌ను బాగానే పంచే అవకాశమూ లేకపోలేదు.
బస్సుపై బాలయ్య గుస్సా
అన్‌స్టాపబుల్ పేరుతో ఆయన ఓ ఓటీటీలో హోస్ట్ షో నిర్వహించుకున్నారు. ఫస్ట్ సిరీస్ ఏదో బాగానే ఆడింది. కానీ, రెండోది పాపం ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ప్రచార యాత్ర బస్సుకు కూడా అన్‌స్టాపబుల్ అని పేరు పెట్టారు. దాని మీద ఓ మూలకు టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు చిత్రాన్ని ఉంచారు. ఇంకోపక్కన కూటమి నేతల ఫొటోలతో పాటు బాలయ్య ఫొటోను ఉంచారు. ఇంతకీ బస్సు మీద(పోస్టర్‌లో) బాలయ్య గుర్రుగా చూస్తుంది ‘అలగ జాతి, సంకర జాతి’ అని అవమానించిన బ్రదర్నా?.. లేదంటే ‘మక్కీ చూస్’ అంటూ గతంలో తిట్టిపోసిన మోదీనా? ఈ రెండూ కాకుంటే.. తండ్రి నుంచి సీటు లాక్కుని, పవన్‌తో పొత్తుల విషయం తనతో మాట వరుసకు కూడా చర్చించకుండా, స్కిల్ కేసులో అరెస్టై జైల్లో ఉన్నప్పుడు కూడా కనీసం టీడీపీ మెయిన్ సీట్లో కూర్చోనివ్వకుండా అడ్డుకున్న వియ్యంకుడు చంద్రబాబు నాయుడ్నా?..
Comments
Please login to add a commentAdd a comment