‘మేమంతా సిద్ధం’ యాత్రకు అడుగడుగునా ఆదరణ
కర్నూలు జిల్లాలో సీఎం జగన్ రోడ్‌షో సూపర్ హిట్
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో జన ప్రభంజనం
రోడ్డుపై ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున అభిమాన జనం
పూల వర్షం.. గజమాలలు.. జై జగన్ నినాదాలు
4 వ రోజు స్టార్ క్యాంపెయినర్‌లతోసీఎం వైఎస్ జగన్
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా నాలుగో రోజైన శనివారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించిన సీఎం వైఎస్ జగన్ పలు ఫొటోలను ట్వీట్ చేశారు. ‘నాలుగో రోజు మేమంతా సిద్ధం యాత్రలో నా స్టార్ క్యాంపెయినర్‌లతో..’ అంటూ పేదలతో మమేకమైన ఫొటోలను ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఈ ఫొటోలు అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. – సాక్షి, అమరావతి
(మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : ‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డనైన నాకు అండగా నిలవండి. మీరే నా స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాలి. జరిగిన మంచిని ఇంటింటా వివరించాలి’ అని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపునకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. గత ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ప్రజలందరూ స్టార్ క్యాంపెయినర్లుగా మారి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో కదం తొక్కుతున్నారు.
నాలుగో రోజు శనివారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొనసాగిన బస్సు యాత్రలోని సన్నివేశాలే ఇందుకు నిదర్శనం. యాత్రలో ఆద్యంతం ప్రజల నుంచి ఘన స్వాగతం లభించడంతో పాటు, మండుటెండను సైతం లెక్క చేయకుండా ముసలిముతక, మహిళలు, యువత.. ఇలా అన్ని వర్గాల వారు బ్రహ్మరథం పట్టారు. శనివారం ఉదయం కర్నూలు జిల్లా రాతన వద్ద బస శిబిరంలో పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, కళ్యాణదుర్గం, కర్నూలు జిల్లా ముఖ్యనేతలు సీఎం జగన్‌ను కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు.
అనంతరం 10.30 గంటల ప్రాంతంలో శిబిరం నుంచి యాత్రను ప్రారంభించారు. రాతన గ్రామంలో భారీ గజమాలతో, ఆనందోత్సాహాలతో సీఎంకు స్వాగతం పలికారు. ఊరంతా∙రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున బారులు తీరి వైఎసార్‌సీపీ ప్రభుత్వానికి తమ మద్దతు తెలియజేశారు. అనంతరం ఇదే జిల్లా తుగ్గలికి చేరుకున్న సీఎం జగన్ గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. గ్రామంలో గడిచిన ఐదేళ్లలో అన్ని వర్గాల వారికి ప్రభుత్వం చేసిన మంచిని సీఎం వివరించారు. అనంతరం పలువురు గ్రామస్తులతో మాట్లాడారు.
జాతీయ రహదారి పొడవునా జనమే జనం
గుత్తి పట్టణంలో రోడ్‌షో తర్వాత బెంగళూరు జాతీయ రహదారి(ఎన్‌హెచ్44)పై మిడుతూరు, పామిడి, కల్లూరు, గార్లదిన్నె మీదుగా సీఎం అనంతపురం చేరుకున్నారు. గుత్తి నుంచి అనంతపురం వరకూ జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న గుత్తి, పామిడి, గార్లదిన్నె, రాప్తాడు మండలాల గ్రామాల్లోని ప్రజలు రోడ్డు మీదకు చేరుకున్నారు. దీంతో ప్రతి పాయింట్ వద్ద సీఎం జగన్ బస్సు ఆపి ప్రజలకు అభివాదం చేశారు. పామిడిలో వేల మంది జనం జాతీయ రహదారి మీదకు చేరుకుని సీఎం జగన్‌కు తమ మద్దతు తెలియజేశారు. శింగనమల నియోజకవర్గ ప్రజలు కల్లూరులో సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతపురం పట్టణంలోని రాజీవ్‌కాలనీ, తపోవనం ప్రజలు, నాయకులు అతిపెద్ద గజమాలలతో సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు.
షెడ్యూల్ ప్రకారం రాత్రి 7 గంటలకు అనంతపురం చేరుకోవాల్సి ఉండగా 9 గంటలు దాటాక చేరుకున్నారు. ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున జనాలు కదిలి వచ్చి రోడ్లపై బారులు తీరడంతో ఉదయం నుంచే నిర్దేశించిన షెడ్యూల్ కంటే చాలా ఆలస్యంగా యాత్ర కొనసాగింది. అయినపటగ్పటికీ ప్రజలు ఏ మాత్రం విసిగి పోకుండా అభిమాన నేతను కలవడానికి ఓపికతో వేచిచూశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అవినీతికి తావులేకుండా సంక్షేమ ఫలాలను తమ దరిచేర్చడంతో పాటు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, వైఎస్సార్ పెన్షన్ కానుక వంటి వివిధ విప్లవాత్మక పథకాలను అమలు చేస్తూ తమకు అండగా నిలిచిన సీఎం జగన్‌ను చూసి ప్రజలు ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు.
అనంతపురంలో రోడ్‌షో అనంతరం రాప్తాడు, ఎస్కేయూ మీదుగా శ్రీసత్యసాయి జిల్లా సంజీవపురం వరకు యాత్ర చేరుకుంది. రాత్రి 10.30 గంటలకు రాప్తాడు చేరుకుంది. అప్పటికే రోడ్డుపై ఉన్న వేల మంది జనాలు జై జగన్ నినాదాలతో సీఎంపై అభిమానాన్ని చాటుకున్నారు. కర్నూలు జిల్లాలోని పత్తికొండ, అనంతపురం జిల్లా గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, అనంతపురం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగింది.
నాలుగోరోజుబస్సు యాత్రకు అపూర్వ స్పందన
కర్నూలు (సెంట్రల్)/తుగ్గలి: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు అభిమానం పోటెత్తింది. పల్లె పల్లెలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మహిళలు, వృద్ధులు, యువతీ యువకులు, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకుల నుంచి అపూర్వ స్పందన లభించింది. అడుగడుగునా పూల స్వాగతంతో అభిమానం చాటుకున్నారు. భారీ క్రేన్లతో గజమాలలు వేసి ఉప్పొంగిపోయారు.
నాలుగో రోజు బస్సు యాత్ర పత్తికొండ నుంచి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. ఉదయం 10.32 గంటలకు సీఎం వైఎస్ జగన్ రాత్రి బస చేసిన శిబిరం నుంచి యాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 2.25 గంటలకు అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లె పొలిమేర్లలోకి చేరుకోవడంతో కర్నూలు జిల్లాలో యాత్ర ముగిసింది. తుగ్గలిలో ఏర్పాటు చేసిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ప్రజల సమస్యలు విన్నారు. సలహాలు స్వీకరించారు.
బస్సు యాత్ర సాగిందిలా..
♦ ఉదయం 10 గంటలకు అనంతపురం జిల్లా కల్యాణదుర్గం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఉమా మహేశ్వర నాయుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పితాని బాలకృష్ణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సానబోయిన మల్లికార్జున్‌తోపాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి సీఎం వైఎస్ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
♦ ఉదయం 10.32 గంటలకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర నాలుగో రోజు పత్తికొండలో ప్రారంభం.
♦ 10.50 గంటలకు రాతనలో అపూర్వ స్పందన. భారీ క్రేన్ ద్వారా సీఎంకు గజమాల వేసి పూల బాట పరిచారు.
♦ 11.20 గంటలకు మాజీ ఎమ్మెల్యే, దివంగత తమ్మారెడ్డి కుటుంబాన్ని సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. తమ్మారెడ్డి పెద్ద కుమారుడు ప్రతాపరెడ్డి, సోదరుని కుమారుడు ప్రహ్లాదరెడ్డి చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. ఇటీవల కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకున్న తమ్మారెడ్డి చిన్న కుమారుడు శ్రీనివాసరెడ్డి, కోడళ్లు రంగమ్మ, విజయలక్ష్మి, అరుణమ్మలను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులు రమణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, మోహన్‌రెడ్డి, చంద్రశేఖరరెడ్డితో మాట్లాడారు.
♦ 11.46 గంటలకు తుగ్గలి సమీపంలో ప్రజలతో ముఖాముఖి.
♦ మధ్యాహ్నం 1.29 గంటలకు గిరిగెట్లలో ప్రజల ఘన స్వాగతం.
♦ 1.49 గంటలకు జొన్నగిరిలో పూల వర్షం. తమ గ్రామ సమీపంలోని చెరువును హెచ్ఎన్ఎస్ఎస్ నీటితో నింపాలని విన్నపం.
♦ 2 గంటలకు ఎర్రగుడిలో సీఎం జగన్ కాన్వాయ్‌పై పూల వర్షం.
♦ 2.25 గంటలకు అనంతపురం జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశం.
♦ రాత్రి 11 గంటలకు బస శిబిరానికి చేరుకున్న సీఎం జగన్
గుత్తిలో జన సునామీ
తుగ్గలిలో ముఖాముఖి అనంతరం తిరిగి బస్సు యాత్ర ప్రారంభమై జొన్నగిరి, ఎర్రగుడి మీదుగా అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. మిట్ట మధ్యాహ్నం భానుడి ప్రతాపాన్ని ఏ మాత్రం లెక్క చేయకుండా రోడ్లపై బారులు తీరి తమ అభిమాన నాయకుడికి ప్రజలు సంఘీభావం తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోకి ప్రవేశించిన యాత్ర బసినేపల్లి, గుత్తి ఆర్‌ఎస్‌ల మీదుగా గుత్తి పట్టణానికి చేరుకుంది.
బసినేపల్లి నుంచి గుత్తి పట్టణం వరకూ ఇసుకేస్తే రాలనంతగా జనం యాత్రలో మమేకం అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే శనివారం సాయంత్రం గుత్తి పట్టణం జన సునామీని తలపించింది. అశేషమైన జనం కదలి రావడంతో సీఎం జగన్ రోడ్ షో కాన్వాయ్ ముందుకు చాలా నెమ్మదిగా కదిలింది. గుత్తి రైల్వే బ్రిడ్జ్ నుంచి ఎన్‌హెచ్ 44 మధ్య 7 కి.మీ దూరం రెండు గంటలకు పైగానే రోడ్‌షో కొనసాగింది. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ ముందుకు సాగారు.
Comments
Please login to add a commentAdd a comment