రాజ్యసభ అభ్యర్థిగా ఈ నెల 27న నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ చైతన్యరాజు హైదరాబాద్లో వెల్లడించారు. గురువారం మంత్రి గంటా శ్రీనివాసరావును ఆయన ఛాంబర్లో చైతన్య రాజు కలిశారు. స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభ బరిలోకి దిగనున్నట్లు చెప్పారు. రెండు జతల నామినేషన్ పత్రాలపై తనకు మద్దతుగా పలువురు ఎమ్మెల్యేలు సంతకాలు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యుల పదవి కాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఎన్నికల కమిషన్ రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. అయితే రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో దూసుకువెళ్తుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల బరిలో కాంగ్రెస్ అధిష్టానం నిలిపే అభ్యర్థులకు తమ మద్దతు ఉండదని ఇప్పటికే సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.
అంతేకాకుండా సమైక్యాంధ్రకు మద్దతు ఇచ్చే పార్టీ నాయకులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలు ప్రకటించారు. దాంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మాజీ మంత్రులు, నాయకులు రాజ్యసభ ఎన్నికల బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.