సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. టీఆర్‌ఎస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌ల పదవీకాలం వచ్చే నెల 21న ముగుస్తుండటంతో.. ఆ స్థానంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ ఏడాది జూన్ 21 నుంచి ఆగస్టు ఒకటో తేదీ మధ్య పదవీకాలం పూర్తవుతున్న రాజ్యసభ సభ్యుల స్థానంలో కొత్తవారిని ఎన్నుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది.
మొత్తం 15 రాష్ట్రాల నుంచి 57 మంది పదవీకాలం పూర్తవుతుండగా.. అందులో తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్ 3న నామినేషన్ల ఉప సంహరణ తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తారు. ఒకరుకన్నా ఎక్కువ మంది పోటీలో ఉంటే.. జూన్ 10న పోలింగ్ నిర్వహిస్తారు. టీఆర్‌ఎస్ నేత బండాప్రకాశ్ గతేడాది డిసెంబర్‌లో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నేపథ్యంలో.. ఆ స్థానంలో ఉప ఎన్నిక కోసం ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది. దీంతో మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నిక జరుగుతోంది.
టీఆర్‌ఎస్ ఆశావహుల్లో ఉత్కంఠ
రాజ్యసభ సభ్యుల ఎన్నికలో ఎమ్మెల్యేలే ఓటర్లు కావడం, రాష్ట్ర అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌కు 103 మం ది సభ్యుల బలం ఉండటంతో.. ఎన్నిక జరిగే 3 స్థానాలూ టీఆర్‌ఎస్‌కే దక్కే అవకాశాలు ఉన్నాయి. దీనితో ఆ పార్టీ ఆశావహులు అధినేత, సీఎం కేసీఆర్ దృష్టిలో పడేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో సామాజికవర్గ సమీకరణాలు కీలకమని.. ఓసీ, బీసీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి.. ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి మరొకరికి అవకాశం దక్కుతుందనే అంచనాలు ఉన్నాయి.
దీనితో ఎవరెవరికి చాన్స్ దక్కుతుందన్న దానిపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం కార్యా లయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, సినీనటుడు ప్రకాశ్‌రాజ్, ఓ ఫార్మా సంస్థ అధినేత, పీఎల్ శ్రీనివాస్, నారదాసు లక్ష్మణరావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ సీతారాం నాయక్ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఉప ఎన్నిక స్థానంలో నామినేషన్ దాఖలుకు ఈ నెల 19 చివరితేదీ కాగా.. మిగతా రెండింటికి 24 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. దీనితో సీఎం కేసీఆర్ మూడు రాజ్యసభ స్థానాలకు కూడా ఈ నెల 18న అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశముందని సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో..: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వి.విజయసాయిరెడ్డి, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభుల పదవీకాలం జూన్ 21తో ముగుస్తుంది. ఆ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. శాసన సభలో పార్టీల బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటే నాలుగు స్థానాలూ వైఎస్సార్‌సీపీ ఖాతాలోకి చేరడం ఖాయంగా కన్పిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment