మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి
కొలిమిగుండ్ల: చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్సార్‌సీపీకి సంబంధించిన 23 ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి లాక్కోగా చివరకు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి దక్కింది 23 సీట్లేనని ఏపీ సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం అవుకు పట్టణంలోని చల్లా భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం హోదాలో చంద్రబాబు జగన్‌పై అడుగడుగునా విషం చిమ్ముతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై కత్తితో దాడి జరిగితే ఆదాడిని కూడా సానుభూతి కోసం జగన్‌నే చేయించుకున్నారని నీచాతి నీచంగా మాట్లాడారని విమర్శించారు. వైఎస్ జగన్ చిన్నాన, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యను కూడా ఆపాదించడం ఇంత కంటే ఘోరం మరొకటి లేదన్నారు. ఈవిషయంపై జగన్ హైకోర్టుకు వెళ్లి సీబీఐతో విచారణ చేయించాలని కోరితే దానిపై చంద్రబాబు బదులు ఇవ్వలేక పోయారన్నారు. ఇలాంటి దుష్టబద్ధి గల చంద్రబాబుకు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు.
నాలుగు జిల్లాల్లో క్వీన్ స్వీప్: ఎన్నికల ముందు పసుపు–కుంకుమ పేరుతో మహిళల్లో సానుభూతి పొందాలని చూసిన చంద్రబాబుకు అక్కా చెల్లెమ్మలు బాబు ముఖానికి పసుపు రాసి జగన్‌కు నుదట తిలకం దిద్దారని చల్లా పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కర్నూలు, కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వైఎస్‌ఆర్‌సీపీ క్వీన్ స్వీప్ చేసిందన్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్ అవ్వాతాతలకు రూ.2వేల నుంచి రూ.3 వేల వరకు పింఛన్ ఇస్తానని ప్రకటించారు, కాని బాబు మాత్రం ఎన్నికలకు రెండు నెలల ముందు పింఛన్ పెంచినా అవ్వాతాతలు శాపం పెట్టారన్నారు. బాబు తీరు వల్లే తన కుమారుడు లోకేష్, మంత్రులతోపాటు పార్టీ ఘోరంగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు. చివరకు రాజధాని అమరావతి ఉన్న కృష్ణా జిల్లాలో సైతం 16 సీట్లకు గాను రెండు సీట్లకే టీడీపీ పరిమితమైందంటే చంద్రబాబును ప్రజలు ఏవిధంగా అసహించుకున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తప్పులు తెలుసుకొని వ్యవహార శైలి మార్చుకోవాలని చల్లా హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment