పార్థీవ దేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు.. చల్లా రామకృష్ణారెడ్డి ఫైల్ ఫొటో (ఇన్‌సెట్)
కోవెలకుంట్ల: చల్లా రామకృష్ణారెడ్డి.. కర్నూలు జిల్లాలో ఈ పేరు తెలియని వారుండరు. ప్రత్యర్థులు ఆయనపై ఫ్యాక్షనిస్టు ముద్ర వేసినా.. చెరగని చిరునవ్వుతో దానిని తుడిపేసుకున్నారు. తన దగ్గరికి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆప్తుడయ్యారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ అభిమాన నేతగా మారారు. ఈయన మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. అవుకు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన చల్లా రామకృష్ణారెడ్డి రాజకీయాల్లోనే కాకుండా సినీ, సాహిత్య రంగాల్లో ప్రావీణ్యం సాధించారు. సైరా.. చిన్నపురెడ్డి, సత్యాగ్రహం సినిమాల్లో నటించారు. అప్పట్లో ఈ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. సినిమాలతోపాటు కవితలు రాయడంలో మంచి నేర్పరిగా ఖ్యాతి గడించాడు. స్వహస్తాలతో అనే కవితలు రాసి వివిధ దినపత్రికలు, మ్యాగజైన్లకు పంపేవారు. వ్యవసాయాన్ని బాగా ఇష్టపడేవారు. తన సొంత పొలంలో జొన్న సాగు చేసి.. మంచి దిగుబడి సాధించారు. దీంతో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా కృషి పండిట్ అవార్డు అందుకున్నారు. అవుకు రిజర్వాయర్ కింద 1,600 ఎకరాల ఆయకట్టుకు రెండు పంటలకు సాగునీరందించడలో చల్లా కృషి ఎంతో ఉంది.
నీలం సంజీవరెడ్డితో చల్లా రామకృష్ణారెడ్డి (ఫైల్)
కోవెలకుంట్లను అగ్రగామిగా నిలిపిన చల్లా
కోవెలకుంట్ల ప్రాంతాన్ని చల్లా రామకృష్ణారెడ్డి అగ్రగామిగా నిలిపారు. 1999 నుంచి 2009 వరకు పదేళ్లపాటు ఎమ్మెల్యే పని చేసి అన్ని రంగాల్లో తీర్చిదిద్దారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి యోగక్షేమాలు తెలుసుకునే నాయకుడిగా గుర్తింపు పొందారు. కోవెలకుంట్ల పట్టణ శివారులో కుందూనదిపై బ్రిటీష్‌కాలంలో నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రభుత్వం నుంచి రూ. 3 కోట్ల నిధులు తెప్పించి.. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేశారు. చల్లా ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో కోవెలకుంట్ల, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాల్లో నిర్మించిన ప్రభుత్వ భవనాలు ఇప్పటికీ రాజ భవనాలను తలపిస్తున్నాయి.
‘అవుకు’ సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర
అవుకు రిజర్వాయర్ సామార్థ్యాన్ని నాలుగు టీఎంసీలకు పెంచడంలో చల్లా రామకృష్ణా రెడ్డి కీలక పాత్ర పోషించారు. 2004లో సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని అవుకు రిజర్వాయర్ వద్దకు రప్పించి, అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. చల్లా కోరిక మేరకు ఎస్‌ఆర్‌బీసీ, జీఎన్‌ఎస్‌ఎస్ కాల్వల ద్వారా నీరు అవుకు రిజర్వాయర్‌లో చేరేందుకు రెండు టన్నెల్ల ఏర్పాటుకు సుమారు రూ.1,200 కోట్ల నిధులను మంజూరు చేస్తూ అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు. నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, అధికారులను పూర్తిపేరుతో చల్లా పిలిచే వారు. ఆప్యాయంగా పలకరించే అభిమాన నేత ఇక లేరని తెలిసి కోవెలకుంట్ల ప్రాంత ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
సమకాలీకుల శకం ముగిసింది
ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతితో పాత నియోజకవర్గమైన కోవెలకుంట్ల, ప్రస్తుత బనగానపల్లె నియోజకవర్గాల్లో రాజకీయంగా సమకాలీకుల శకం ముగిసింది. పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథిరెడ్డి తండ్రి బిజ్జం సత్యంరెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి, ప్రస్తుత బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చిన్నాన్న కాటసాని శివారెడ్డి, కొలిమిగుండ్ల మండలం నాయినిపల్లెకు చెందిన ఎర్రబోతుల వెంకటరెడ్డి రాజకీయ సమకాలీకులు. బిజ్జం సత్యంరెడ్డి 2000లో మృతి చెందగా, కాటసాని శివారెడ్డి 2017లో, ఎర్రబోతుల వెంకటరెడ్డి 2020లో మృతి చెందారు. చల్లా రామకృష్ణారెడ్డి 2021 ప్రారంభ తొలిరోజున మరణించారు. రాజకీయాల్లో కురువృద్ధులుగా పేరుగాంచిన ఈ నలుగురు నేతలు మృతి చెందటంతో నియోజకవర్గంలో నమకాలీకుల శకం ముగిసిపోయింది. వీరితో పాటు కోవెలకుంట్ల నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తిపు పొందిన రాజకీయ నేత కర్రా సుబ్బారెడ్డి 2004లో మరణించారు.
రాజకీయాల్లో ప్రత్యేక స్థానం
చల్లా స్వగ్రామం అవుకు మండలం ఉప్పలపాడు. 1948 ఆగస్టు 27న చిన్నపురెడ్డి, నారాయణమ్మ దంపతులకు జన్మించారు. ఏజీ బీఎస్సీతో పాటు ఎంఏ చదివారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమారుడు భగీరథరెడ్డి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఫ్యాక్షన్‌లో తండ్రి చిన్నపురెడ్డి మరణించడంతో రామకృష్ణారెడ్డి ఫ్యాక్షన్‌కు స్వస్తి పలికి రాజకీయాల్లో చేరారు. రాజకీయ నేతగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 1983లో పాణ్యం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో డోన్ అసెంబ్లీ స్థానానికి, 1991లో నంద్యాల లోక్‌సభ స్థానానికి టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి 1994 ఎన్నికల్లో కోవెలకుంట్లలో ఓడిపోయారు. 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కోవెలకుంట్ల నుంచి ఘన విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో బనగానపల్లెలో ఓటమి పాలయ్యారు. 2014 తర్వాత ప్రభుత్వ హయాంలో ఏడాదిన్నర పాటు ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. 2019లో వైఎస్సార్‌సీపీలో చేరి.. కాటసాని రామిరెడ్డి విజయానికి సాయం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment