ఉయ్యూరు (కంకిపాడు): తుని ఘటనకు పూర్తి బాధ్యుడు సీఎం చంద్రబాబే అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలోని చర్మకారులను సోమవారం ఆయన కలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై నేరం నెట్టే యత్నం చేస్తూ బాధ్యతారాహిత్యంతో వ్యవహరించారని ఆరోపించారు. దమ్ముంటే కుట్ర కేసులు పెట్టాలని సవాల్ చేశారు. కాపు ఐక్య గర్జనను విఫలం చేసేందుకు చంద్రబాబు, అధికార పక్షం సాయశక్తులా కృషి చేయడం వల్లే ఆగ్రహించిన కాపులు విధ్వంసానికి పాల్పడ్డారని స్పష్టం చేశారు. గర్జన వేదికపై టీడీపీ తప్ప అందరు నేతలూ ఉన్నారన్నారు. బాధ్యతను విస్మరించి ప్రతిపక్ష నేతపైనా, పులివెందుల రౌడీలు అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.
ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే వాగ్దానాన్ని విస్మరించడమే కాకుండా, మాదిగ వ్యతిరేక శక్తులను పెంచిపోషిస్తున్నారని ఆరోపించారు. తుని ఘటనపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని, విధ్వంసానికి కారకులు ఎవరో తేలిపోతుందని స్పష్టంచేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు ఇచ్చిన మాట నెరవేర్చకపోతే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ మాదిగలు సత్తా చాటుతారని, ఆగ్రహాన్ని తట్టుకోలేరని కృష్ణమాదిగ హెచ్చరించారు.
'చంద్రబాబే బాధ్యుడు'
Published Mon, Feb 1 2016 10:45 PM | Last Updated on Mon, Oct 8 2018 3:00 PM
Advertisement