
ఏపీ రాజధానికి ‘చండీ గఢ్ సూత్రం’
ఏపీ మంత్రి నారాయణ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం లో భాగంగా భూమి ఇచ్చే రైతులకు చండీగఢ్ తరహాలో పరిహారం అమలు చేసే అవకాశం ఉందని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ అన్నారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. చండీగఢ్‌లో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు 1000 గజాలు ఇచ్చారని, ఇది కాకుండా వాణిజ్య సముదాయ ప్రాంతం (కమర్షియల్ జోన్)లో మరో 100 గజాలు అదనంగా ఇచ్చారని పేర్కొన్నారు. ఈ తరహా పరి హారం ఇచ్చే అవకాశం ఉందన్నారు. దీనిపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు.
9న తెంగ్ చూతో సమావేశం
సింగపూర్ పట్టణాభివృద్ధి విభాగం నిపుణుడు, ఏపీ రాజధాని సలహా కమిటీలో సభ్యుడైన కూ తెంగ్ చూ ఈ నెల 9న రాష్ట్రానికి రానున్నారని మంత్రి అన్నారు. ఆ రోజు రాజధాని సలహా మండలి సభ్యుల బృం దం సమావేశం జరుగుతుందని, అందులో తెంగ్ చూ పాల్గొంటారని అన్నారు.