టీడీపీ అధినేత నారా చంద్రబాబు అవినీతి సామ్రాజ్యానికి చక్రవర్తి వంటి వారని ఎన్‌టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు.
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత నారా చంద్రబాబు అవినీతి సామ్రాజ్యానికి చక్రవర్తి వంటి వారని ఎన్‌టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు. చంద్రబాబును మించిన అవినీతిపరుడు ఈ ప్రపంచంలో మరెవరూ ఉండరంటూ స్వ యంగా ఆయన మామ దివంగత ఎన్.టి.రామారావు చెప్పిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. చంద్రబాబు అవినీతిపై ‘బాబు జమానా - అవినీతి ఖజానా’ అనే పుస్తకాన్ని కమ్యూనిస్టు పార్టీ, ‘వంద తప్పులు’ అంటూ బీజేపీ పుస్తకాలను ప్రచురించాయన్నారు. అటువంటి వ్యక్తి అవినీతి గురించి ప్రసంగాలు ఇవ్వడం తగదని లక్ష్మీపార్వతి ఎద్దేవాచేశారు. సోమవారం ఆమె తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నీతిమంతుడైతే ఆరోపణలపై విచారణకెందుకు సిద్ధపడట్లేదని ప్రశ్నించారు.