
బాబు మార్కు కోతలు
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఆదర్శరైతు వ్యవస్థను రద్దు చేసేందుకు చంద్రబాబు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా తొలగించాలని నిర్ణయించారు.
‘ఏరు దాటే వరకు ఓడ మల్లన్న..
ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న’ అన్న చందంగా తయారైంది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తీరు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆల్‌ఫ్రీ అంటూ అబద్ధాలతో ప్రచారం హోరెత్తించి అధికారం చేపట్టిన ఆయన ఇప్పుడు తన విశ్వరూపం చూపిస్తున్నాడు. ఓట్ల కోసం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ప్రకటించడంతో పాటు ఇంటికో ఉద్యోగం ఇస్తామని మభ్యపెట్టిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలకే ఎసరు పెడుతున్నారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు ఆదర్శ రైతులను తొలగించాలని వైజాగ్‌లో గురువారం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయించడం బాబు మారలేదనే విషయాన్ని తెలియజేస్తోంది.
సాక్షి, నెల్లూరు : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఆదర్శరైతు వ్యవస్థను రద్దు చేసేందుకు చంద్రబాబు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా తొలగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించే ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది.
పాలనలో పారదర్శకత పాటిస్తానని చెబుతున్న చంద్రబాబు..పథకంలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి బదులుగా ఆ వ్యవస్థనే రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. తెలుగు తమ్ముళ్లకు అవకాశం కల్పించే ఉద్దేశంతోనే ఈ రెండు వ్యవస్థలను రద్దుచేసి వాటి స్థానంలో కొత్త విధానాలను అమలులోకి తేవాలని యోచనలో ఉన్నట్లు సమాచారం. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అన్నదాతకు సలహాల కోసం..
రైతులకు సాగుకు సంబంధించిన సూచనలు అందజేసేందుకు మండలంలోవున్న ఒకే ఒక్క అధికారి సరిపోరనే ఉద్దేశంతో 2007 మార్చిలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదర్శరైతు వ్యవస్థను ప్రవేశపెట్టారు. క్షేత్రస్థాయిలో రైతులకు సలహాలు అందజేసేందుకు జిల్లాలో 1,414 మంది ఆదర్శ రైతుల్ని నియమించారు. వీరికి నెలకు వెయ్యి రూపాయల గౌరవ వేతనం ప్రకటించారు. రైతులకు తగు సలహాలు ఇచ్చి అధిక దిగుబడులు సాధించడం వీరి నియామక ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం జిల్లాలో 1,224మంది ఆదర్శ రైతులు కొనసాగుతున్నారు. వీరందరిని ఇంటికి పంపేం దుకు టీడీపీ ప్రభుత్వం సమాయత్తమైంది.
ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థ కూడా రద్దే:
ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించి ప్రతి ఒక్క పంచాయతీకి ఒక ఫీల్డ్ అసిస్టెంట్‌ను నియమించారు. వీరు గ్రామీణప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల్ని పర్యవేక్షిస్తుంటారు. వీరిలో కూడా అధిక సంఖ్యలో గత ప్రభుత్వ మనుషులు ఉన్నారనే ఉద్దేశంతో రద్దు చేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. వీరి స్థానంలో తెలుగు తమ్ముళ్లను నియమించుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 921 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. వారిలో ఇప్పటికే పలువురిని తొలగించగా 500 మందికి పైగా కొనసాగుతున్నారు. కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో వీరంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వీరు కూడా అతి కొద్దిరోజుల్లోనే తమ ఉద్యోగాలు కోల్పోయి వీధుల్లో పడే పరిస్థితి నెలకొంది. మరోవైపు వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారి కొనసాగింపుపైనా నీలినీడలు అలుముకున్నాయి. ఓవైపు పింఛన్ మొత్తాన్ని పెంచుతున్నామని ప్రకటించిన ప్రభుత్వం ఇంకోవైపు వివిధ రకాల సాకులతో పింఛన్ లబ్ధిదారులను తగ్గించే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఎన్నికల ముందు ఒకలా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకోలా వ్యవహరిస్తున్న చంద్రబాబు తీరుపై జిల్లా ప్రజలు మండిపడుతున్నారు.