రెడ్డిగణపవరం
(బుట్టాయగూడెం), న్యూస్‌లైన్ :
అధికారం కోసం ఆచరణ సాధ్యం కాని హామీలిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజలను మోసగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు విమర్శించారు. బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరంలో విశ్వేశ్వర అన్నపూర్ణ, కనకదుర్గమ్మను ఆదివారం బాలరాజు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాలరాజు విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ఇస్తున్న హామీలను రాష్ట్ర ప్రజలు నమ్మేస్థితిలో లేరని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్ష నేతగా ఉండగా విభజనకు లేఖ ఇచ్చి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చారని, అధికారం ఇస్తే మరింత అధ్వానంగా తయారు చేస్తారని ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం, రుణాల మాఫీ అంటూ చంద్రబాబు ఇస్తున్న హామీలు నెరవేర్చడం ఎవరివల్లా కాదని, ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త పార్టీలు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని వాటివల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు.
ఆ పార్టీలకు కనీసం డిపాజిట్లు కూడా రావన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే విభజనను అడ్డుకోలేకపోయారని ఇప్పుడు జై సమైకాంధ్ర పేరుతో కొత్త పార్టీని స్థాపిస్తే ప్రజలు నమ్మేస్థితిలో లేరని విమర్శించారు. ఒక్కటిగా కలిసి ఉన్న తెలుగుజాతిని విడగొట్టడంలో ప్రధానపాత్ర పోషించిన బీజేపీని సీమాంధ్రలో ప్రజలు తరిమికొట్టాలని పిలుపు నిచ్చారు. వైసీపీతోనే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యమని బాలరాజు చెప్పారు.
తమ పార్టీ ప్రకటించిన అమ్మఒడి, పింఛన్లు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, రైతుకు మద్దతుధర అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తాయన్నారు. వీటితో పాటు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని చెప్పారు. మాటతప్పని మడమ తిప్పని నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. ఆయన వెంట పార్టీ నేతలు గద్దే వీరకృష్ణ, సర్పంచ్ కోర్స బాలకృష్ణ, అల్లూరి రంగారావు, యాదాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబు
Published Mon, Mar 17 2014 3:01 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement