సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కాంట్రాక్టు పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వెనుకబడిన వర్గాల ప్రజలంతా అంబేద్కర్, పూలే, కొమరం భీంతో కీర్తిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తెల్లం బాలారాజు అన్నారు. చారిత్రాత్మక చట్టాన్ని రూపొందించిందుకు ఆయన కృతజ్ఞత తెలిపారు. మంగళవారం ఆయన శాసనసభ సమావేశాల్లో మాట్లాడుతూ.. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇప్పటికీ చాలా వెనుకబడి ఉన్నారని అన్నారు. మన రాష్ట్రంలో ఆ విధంగా ఉన్నవారిని అభివృద్ధి చేసేందుకు వైఎస్ జగన్ గొప్ప ఆలోచన చేశారని అభినందించారు.
దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారి ఆశయం కోసం సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకుని, అనేక పాదయాత్రల ద్వారా పేద ప్రజలను కష్టాలను దగ్గర నుంచి చూసిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి సీఎం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని బాలారాజు అన్నారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం దేశ చరిత్రంలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని చెప్పుకొచ్చారు. ఇలాంటి గొప్ప ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేస్తోందుకు ఎంతో గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.
సభలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై విమర్శలు తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో కేవలం పచ్చచొక్కాల నేతలకు మాత్రమే పనులు జరిగేవని ఆరోపించారు. కేవలం ఒక్కసామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కేవని, దోచుకున్నవాడికి దోచుకున్నంతగా ఉండేదని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులన్నింటిపైనా విచారణకు ప్రభుత్వం ఆదేశించాలని ఆయన కోరారు. అలాగే దానిపై శ్వేతపత్రం కూడా విడుదల చేయాలన్నారు. గత ప్రభుత్వంలా కాకుండా ప్రస్తుతం సీఎం అందరకీ సమాన అవకాశాలు కల్పించాలని కీలక చట్టాన్ని తీసుకువచ్చినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment