సాక్షి, అమరావతి: అవాస్తవ కథనాలపై చర్యలు తీసుకునేందుకు జీవో తీసురావడంలో తప్పేముందని ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షం ఆరోపించినట్లుగా సదరు జీవో కేవలం ఒక పత్రిక కోసం కాదని స్పష్టం చేశారు. అవాస్తవాలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకునే అధికారాలు సంబంధిత అధికారులకే ఉంటాయని.. ఇందులో రాజకీయ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు చేసిన విమర్శలను బుగ్గన తిప్పికొట్టారు. పోలవరం నిర్వాసితుల గురించి కథనాలు రాసిన ‘సాక్షి’పై చర్యలు తీసుకోవాలంటూ గత ప్రభుత్వం జీవోలు జారీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వం లాగా తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదని.. అవాస్తవాలు ప్రచారం చేసే వారిపైనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
‘2016 సెప్టెబరులో ప్రత్యేక హోదాను నీరుగార్చి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకోవడాన్ని వ్యతిరేకిస్తూ మేం పోరాటం చేశాం. పోలవరం ప్రాజెక్టు నిర్వహణ కాంట్రాక్టులు దక్కించుకోవడానికే ఆనాడు బాబు రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా తాకట్టుపెట్టారు. పోలవరం నిర్వాసితుల నష్టపరిహారం విషయంలో జరుగుతున్న అవకతవకలపై సాక్షిలో కథనాలు వచ్చాయి. దీంతో సాక్షిపై చర్యలు తీసుకోమని అప్పటి కలెక్టర్ కాటమనేని భాస్కర్ 2018లో నోటీసులు జారీ చేశారు. సాక్షి పేపర్‌పై చర్యలు తీసుకోవాలంటూ 2018 ఏప్రిల్ 24న ఓ జీవో, మే 18న జీవో 1088, అక్టోబరులో జీవో నంబరు 2151 జారీ చేసి జగతి పబ్లికేషన్స్, సాక్షి ఎడిటర్ వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు. కానీ మేం అలా చేయడం లేదు. అవాస్తవాలు రాసే అందరిపై చర్యలకు జీవో 2430 తీసుకువచ్చాం’ అని బుగ్గన పేర్కొన్నారు.
ఇక అసెంబ్లీ వద్ద మార్షల్స్‌తో గొడవపడిన టీడీపీ నేతల తీరును బుగ్గన విమర్శించారు. సభా నిబంధనల గురించి చదివి వారికి వినిపించారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు బుగ్గన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. మార్షల్స్‌తో వారు ప్రవర్తించిన వీడియోను సభలో ప్లే చేశారు. ఇందులో.. ‘ ఒక ఉన్మాది ముఖ్యమంత్రి అయితే ఇలాగే ఉంటుంది’అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా నిన్న కూడా చంద్రబాబునాయుడు సభలో ఇదే తీరుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. బుధవారం శాసనసభలో స్పీకర్‌ను బెదిరించేలా ఆయన మాట్లాడారు. తనను మాట్లాడనివ్వకపోతే మర్యాద ఉండదంటూ స్పీకర్ వైపు వేలెత్తి చూపుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment