'యోగాను ప్రోత్సహించేందుకు రూ. 25 కోట్లు'
* ఇది మోదీ తలపెట్టిన మహాసంకల్పమని కితాబు
* యోగా దినోత్సవంలో సీఎం చంద్రబాబు
* విద్యార్థులతో కలిసి 35 నిమిషాలు ఆసనాలు వేసిన సీఎం
సాక్షి, విజయవాడ బ్యూరో : రాష్ట్రంలో యోగా గురించి ప్రచారం, ప్రోత్సాహానికి రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. వైద్య ఆరోగ్యశాఖలో మిళితం చేస్తూ యోగా గురించి ప్రజల్లో అవగాహన నింపి, వారి ఆరోగ్యాలను కాపాడటానికి ఈ డబ్బును ఖర్చుచేయనున్నట్టుగా ఆయన వివరించారు.
విజయవాడలోని ఏ-కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పూర్వీకులు వారసత్వంగా ఇచ్చిన యోగాకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చే మహాసంకల్పానికి శ్రీకారం చుట్టారన్నారు. గతంలో వివేకానందుడు తన వాగ్ధాటితో ప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేశారని, ఈ రోజున నరేంద్రుడు యోగాతో ప్రపంచమంతటితో సంబంధాలు నెలకొల్పుతున్నాడని బాబు వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా సీఎం, మంత్రులు, అధికారులు, సుమారు వెయ్యి మంది విద్యార్థులతో రాష్ట్ర యోగా అసోసియేషన్ కార్యదర్శి యోగాచార్య రామలింగేశ్వరావు 35 నిమిషాల పాటు ఆసనాలు వేయించారు.
టెక్నాలజీని వినియోగించుకోండి
రాజధాని నగరానికి పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలని, అందుకు టెక్నాలజీని ఉపయోగించుకుని విజయవాడ పోలీసులు చేస్తున్న ప్రయత్నం బాగుందని సీఎం అభినందించారు. యోగా సభ ముగిసిన తర్వాత పోలీసు అధికారులు నిర్వహించిన కార్యక్రమంలో ‘నాలుగో సింహం’ యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. నాలుగో సింహం బ్రాండ్ అంబాసిడర్, సినీ నటుడు సాయికుమార్ మాట్లాడుతూ తాను ఈరోజే రియల్ పోలీస్ అయ్యానని చెప్పారు. అనంతరం వెదురు తోటల పెంపకం పరిశీలనకు వెళుతున్న జగ్గయ్యపేట, మైలవరం రైతుల అధ్యయన యాత్రను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
ఫోన్ ట్రాకింగ్‌పై సీఎం ఆసక్తి
నాలుగో సింహం యాప్ ద్వారా ప్రమాదంలో ఉన్న వారి ఫోన్‌ను ట్రాక్ చేస్తామని నిర్వాహకులు చెప్పగా సీఎం ఆసక్తిగా విని పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది బయట వారిక్కూడా తెలుస్తుంది కదా.. అని ప్రశ్నించడంతో అందరూ ఒక్కసారిగా గొల్లుమన్నారు. తెలంగాణ ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేసిందని ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ అనుమానాలు వ్యక్తం చేయడం విశేషం.