కదిరి: ఏపీ సీఎం చంద్రబాబు రాయలసీమను విస్మరిస్తున్నారని వైఎస్సార్సీపీ కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా ధ్వజమెత్తారు. చంద్రబాబును రాయలసీమ నుంచే ప్రతిసారి అసెంబ్లీకి పంపిస్తున్నారని, కానీ ఆయన రాయలసీమ ప్రజలకు ఏం చేశాడని ప్రశ్నించారు.
24 గంటలూ సీఎం కేవలం రెండు జిల్లాలపై దృష్టి పెడుతూ రాయలసీమను పట్టించుకోవడం లేదన్నారు. భవిష్యత్తులో రాయలసీమ ఉద్యమం వస్తే అందుకు కారణం చంద్రబాబే అని చాంద్ బాషా వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ కదిరిలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించాయి. అంబేద్కర్ సర్కిల్, ఇందిరాగాంధీ సర్కిల్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు.
మోదీకి ప్రత్యేక హోదాపై వినతిపత్రం ఇస్తామన్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా... సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్‌తో పది నిమిషాలు ముచ్చటించడం ఎంత వరకు సబబు అని చాంద్బాషా ప్రశ్నించారు. లోకేశ్‌తో గడిపిన సమయం ప్రతిపక్ష నేతకు కేటాయించి ఉంటే ప్రత్యేక హోదాపై ప్రజల వాణి వినిపించే వారిమని అన్నారు.