సీమ ద్రోహి చంద్రబాబు
నందికొట్కూరు/ పగిడ్యాల: సీఎం చంద్రబాబు నాయుడు..రాయలసీమ ద్రోహి మారారని వైఎస్‌ఆర్‌సీపీ కమిటీ సభ్యులు ఆరోపించారు. శనివారం కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో కృష్ణానదీ పరివాహక ప్రాంతాన్ని వీరు పరిశీలించారు. శాతనకోట, నెహ్రూనగర్, సంగమేశ్వరం ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ కమిటీలో పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, కర్నూలు జిల్లా పార్టీ పరీశీలకుడు, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు చేరకముందే సాగర్‌కు విడుదల చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. శ్రీశైలం డ్యాంలో 854 అడుగుల నీరు వచ్చే వరకూ కిందకు వదిలేది లేదని వారం రోజులకు క్రితం ప్రకటించిన సీఎం.. రెండు రోజులకే మాటతప్పడం శోచనీయమన్నారు. రాయలసీమ వాసి అయిన సీఎం.. ఇక్కడి ప్రజలను చిన్నచూపు చూపడం తగదన్నారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు.. కేసీఆర్ చెప్పినట్లు ఆటాడుతూ రాష్ట్రప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ చెప్పినట్లుగా నడుచుకుంటూ శ్రీశైలం డ్యాం నుంచి 10 టీఎంసీల నీరు సాగర్‌కు తరలించుకుపోవడం శోచనీయమన్నారు. పట్టిసీమ నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు నీరు అందిస్తానని చెప్పి ఏడాదైనా.. చుక్క నీరు అందించలేదని మండిపడ్డారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తులకు అవసరమైన చోట ఘాట్లు ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. పరిపాలన చేతకాకపోతే అన్ని పార్టీల్లో రాజకీయ ప్రముఖులు ఉన్నారని.. అఖిలపక్ష కమిటీ వేసి అభిప్రాయాలు తీసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ జగదీశ్వరరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజుయాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు యుగంధరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.