ప్రజాభీష్టం మీద ఎందుకీ పగ? | Chandrababu dual attitude SC classification | Sakshi
Sakshi News home page

ప్రజాభీష్టం మీద ఎందుకీ పగ?

Published Wed, Sep 6 2017 9:28 AM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

ప్రజాభీష్టం మీద ఎందుకీ పగ? - Sakshi

ప్రజాభీష్టం మీద ఎందుకీ పగ?

విశ్లేషణ
అమెరికన్‌ తత్వవేత్త నామ్‌ చోమ్‌స్కీ ప్రభుత్వానుకూలమైన వార్తలను ప్రజలు నమ్మే విధంగా రూపొందించే విధానాన్ని ‘మాన్యుఫాక్చరింగ్‌ కన్‌సెంట్‌’గా అభివర్ణించారు. రాష్ట్రంలో కూడా కొందరు తమ స్వార్థం కోసం మాన్యుఫాక్చరింగ్‌ ఉద్యమాలను లేవదీసి లబ్ధి పొందారు. భావోద్వేగాలను రెచ్చగొట్టడం వల్ల, తగిన వ్యవధి లేకపోవడం వల్ల ప్రజలు వాస్తవాలు తెలుసుకోలేరు. అందుకే తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీకే అధికారం అప్పగించారు.
 
ప్రజల న్యాయమైన డిమాండ్లను, ఎన్నికల హామీలను నెరవేర్చకుండా; సొంత ఎజెండాలతో పాలించే ప్రభుత్వాలను దారిలోకి తేవడానికి ప్రజలు ఉపయోగించే ఆయుధం ‘ఉద్యమం’. సాధారణంగా ప్రజానీకం ఓపికతోనే ఉంటుంది. కష్టాలు, నష్టాలను మౌనంగా భరిస్తుంది. ప్రజలు ఉద్యమబాట పట్టారంటే అర్థం– వారి సహనం నశించినట్టే. ఇక ఉద్యమాల వెనుక ఉన్న ఆకాంక్షలను గుర్తించకుండా, వాటిని అణచివేయడమంటే ప్రభుత్వం తన వేలితో తన కన్ను పొడుచుకోవడమే. ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. 
 
తెలుగుదేశం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. రెండేళ్ల పాటు ప్రజలు ఓపికగా భరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే లక్షణాలేవీ రాష్ట్ర ప్రభుత్వ చర్యలలో కనపడడం లేదని గ్రహించిన తరువాత హక్కుల సాధనకు ఇప్పుడు ఉద్యమబాట పట్టారు. కాపు రిజర్వేషన్‌ ఉద్యమం, ఎస్సీ వర్గీకరణ, మద్యపాన వ్యతిరేకోద్యమం (ఇది రూపుదిద్దుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు), ప్రత్యేక హోదా ఉద్యమం– ఇలా అనేక ఉద్యమాలు ఉన్నాయి. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న భూసేకరణ విధానానికి వ్యతిరేకంగా కూడా ప్రజలు ఉద్యమిస్తున్నారు. మూడున్నర సంవత్సరాల తమ పాలనలో దాదాపు అన్ని వర్గాల ప్రజలు ఎందుకు రోడ్ల పైకి వచ్చి ఉద్యమిస్తున్నారో, ఆ అసంతృప్తి ఎందుకో ప్రభుత్వం అర్థం చేసుకోవలసి ఉంది. తదనుగుణంగా ఆ పార్టీ ప్రభుత్వం తన విధానాలను సవరించుకునే బాధ్యతను కలిగి ఉంది. కానీ ఇందుకు విరుద్ధంగా ఉద్యమాలను అణచివేయడానికీ, నిర్బంధకాండతో కృత్రిమమైన కౌంటర్‌ ఉద్యమాలను (మాన్యుఫ్యాక్చరింగ్‌ యాజిటేషన్స్‌) తానే నడిపిస్తున్నది. హక్కుల కోసం ఉద్యమిస్తున్న వారిని రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నవారిగా చిత్రీకరిస్తున్నది. అమెరికన్‌ తత్వవేత్త నామ్‌ చోమ్‌స్కీ ప్రభుత్వానుకూలమైన వార్తలను ప్రజలు నమ్మే విధంగా రూపొందించే విధానాన్ని ‘మాన్యుఫాక్చరింగ్‌ కన్‌సెంట్‌’గా అభివర్ణించారు. రాష్ట్రంలో కూడా కొందరు తమ స్వార్థం కోసం మాన్యుఫాక్చరింగ్‌ ఉద్యమాలను లేవదీసి లబ్ధి పొందారు. భావోద్వేగాలను రెచ్చగొట్టడం వల్ల, తగిన వ్యవధి లేకపోవడం వల్ల ప్రజలు వాస్తవాలు తెలుసుకోలేరు. అందుకే తెలం గాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీకే అధికారం అప్పగించారు. అయితే అన్ని సందర్భాలలో కౌంటర్‌ ఉద్యమాలతో లబ్ధి పొందగలమన్న నమ్మకంతో చంద్రబాబు ప్రస్తుతం అన్ని ఉద్యమాలను అణచివేయడానికి అదే ఆయుధాన్ని ఉపయోగించాలని భావిస్తున్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా తెలుగుదేశం సాగిస్తున్న కౌంటర్‌ ఉద్యమాల తీరుతెన్నులను సమగ్రంగా విశ్లేషించుకోవాలి. 
 
ఎస్సీ వర్గీకరణ– చంద్రబాబు ద్వంద్వ వైఖరి
షెడ్యూల్డ్‌ కులాల వర్గీకరణ కోసం మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ రెండు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చంద్రబాబు ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. వర్గీకరణకు అనుకూలంగా అసెం బ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి, కేంద్రానికి పంపారు. అక్కడ నుంచి అనుమతి రాక ముందే ఆర్డినెన్స్‌ ద్వారా రిజర్వేషన్‌ ఫలాలను ప్రభుత్వ పరంగా ఆయా వర్గాలకు అందించారు కూడా. తరువాత జరిగిన పరిణామాలలో న్యాయస్థానం ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను కొట్టివేయడంతో సమస్య మొదటికొచ్చింది. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న చంద్రబాబు, ఆయన పార్టీ ఈ మూడున్నరేళ్లుగా ఏనాడూ కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాలేదు. పైగా కృష్ణమాదిగ మంగళగిరిలో కురుక్షేత్ర సభ ఏర్పాటు చేసుకుంటే అడ్డుకున్నారు. ఎంఆర్‌పీఎస్‌ ఉద్యమానికి వ్యతిరేకంగా కొందరితో కౌంటర్‌ ఉద్యమాన్ని కూడా మొదలుపెట్టించారు. ఈ కౌంటర్‌ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఒకరిద్దరు నాయకులకు తరువాత రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ పదవులు కూడా దక్కాయి. 
 
కాపు రిజర్వేషన్‌ ఉద్యమం
తెలుగుదేశం తన ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానం మేరకు కాపులను బీసీలలో చేర్చకుండా జరుగుతున్న జాప్యానికి నిరసనగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు రిజర్వేషన్‌ ఉద్యమాన్ని అణచివేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ఏడాది కాలంగా నిర్బంధ కాండను కొనసాగిస్తున్నది. ముద్రగడకు వ్యతిరేకంగా కాపు, బలిజనేతలను కొందరిని సమీకరించి కౌంటర్‌ ఉద్యమాన్ని కూడా సాగిస్తున్నారు. ఒకవైపు కాపులను బీసీలలో చేర్చాలన్న తమ విధానానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని చెబుతూనే, మరోవైపు లోపాయికారీగా బీసీ నేతలతో వ్యతిరేక ప్రకటనలు చేయిస్తున్నారు. వారితో లోపాయికారీగా కౌంటర్‌ ఉద్యమాన్ని ప్రారంభించేటట్టు చేసి, అన్ని రకాలుగా సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. తునిలో జరిగిన రైలు దహనం సంఘటనకు ముద్రగడను బాధ్యుడిని చేయడంతో పాటు, ఆయనను ఏనాడూ కాపు, బలిజల హక్కుల కోసం పాటుపడని స్వార్థపరునిగా చిత్రించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. 
 
ప్రత్యేక హోదా నుంచి ప్రత్యేక ప్యాకేజీకి
రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌ సాక్షిగా నాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ, కేంద్ర మంత్రిమండలి నిర్ణయాల ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి. ఈ అంశంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ, తక్షణం ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌ ఒక దశలో టీడీపీ, బీజేపీయేతర పార్టీలన్నీ ఉద్యమం చేశాయి. దీనితోనే ఆ అంశం ప్రజలలో సెంటిమెంట్‌గా బలపడింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా నలుగురు వ్యక్తులు ఆత్మార్పణ చేసుకున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు అప్రమత్తమై తాను కూడా ప్రత్యేక హోదా కోసం ఉద్యమించబోతున్నట్టు ప్రజ లందర్నీ నమ్మిస్తూ వచ్చి చివరకు రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీయే మేలు అని, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఒరిగిందేమీ లేదంటూ ప్లేట్‌ ఫిరాయించారు. రాష్ట్రానికి ‘ప్రత్యేక హోదా’రాకపోవడానికి బీజేపీయే కారణమంటూ పరోక్ష ప్రచారాన్ని నిర్వహించారు. 
 
‘మద్యపాన వ్యతిరేక ఉద్యమం’రాకుండా కౌంటర్‌
ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చిన ‘దశలవారీ మద్యపాన నిషేధం’ హామీ, బెల్ట్‌ షాపులను రద్దు చేస్తూ ప్రమాణ స్వీకారం రోజున ముఖ్యమంత్రి చేసిన ‘తొలి సంతకం’ హామీలు మూడున్నర సంవత్సరాలుగా ఆచరణకు నోచుకోలేదు. ఇంకా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నూతన మద్య విధానం’లో భాగంగా అన్ని పట్టణాల్లో జనావాసాల మధ్య మద్యం షాపులు ఏర్పాటు అవుతున్నాయి. దీని మీద మహిళల ఆగ్రహాన్ని గ్రహించిన బాబు దానికీ ఓ కౌంటర్‌ వదిలారు. ‘రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్‌ షాపులు ఉండేందుకు వీల్లేదు’ అంటూ మౌఖికమైన ఆదేశాలు జారీ చేశారు. దానికి బ్రహ్మాండమైన ప్రచారం కల్పిం చారు. సీఎం ఆదేశాలు అమలు జరిగినట్లు, బెల్ట్‌ షాపులు తొలగిపోయినట్లుగా ప్రచారం చేస్తున్నారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు స్పందించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెల్ట్‌ షాపుల్ని తొలగించి ఉంటే మద్యం అమ్మకాలు తగ్గి ఉండాలి. కానీ ‘సీఎం కోర్‌డాష్‌ బోర్డు’లోని వివరాల ప్రకారం 2016 ఆగస్టు మాసంలో మద్యం అమ్మకాల విలువ రూ. 1,019.78 కోట్లు ఉండగా, 2017 ఆగస్టు మాసానికి ఆ మొత్తం 1,195.59 కోట్లు. అంటే ఆదాయంలో వృద్ధిరేటు 17.24 శాతం. సీఎం ఆదేశాలు అమలు జరిగి రాష్ట్రంలో బెల్ట్‌ షాపు ఒక్కటీ లేనట్లయితే అమ్మకాలు తగ్గాలి కదా? మరి ఎలా పెరిగినట్లు? 
 
పోలవరాన్ని అడ్డుకుంటున్నదెవరు?
పోలవరం ప్రాజెక్టును 2018 నాటికల్లా పూర్తి చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో చంద్రబాబునాయుడు పలు వేదికల నుంచి చెప్పారు. ఎప్పుడైతే తమ కాంట్రాక్టర్‌ ఆ పనుల్ని సకాలంలో చేయలేకపోతున్నారని గ్రహించారో.. కాంట్రాక్టర్‌పై వేటు వేయకుండా పనులన్నీ విభజించి నిబంధనలకు విరుద్ధంగా సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పజెప్పి.. 2018 నాటికి తొలి దశæ నిర్మాణం పూర్తి కాబోతున్నదని మాట మార్చారు. తాజాగా, ప్రాజెక్టు తొలిదశ కూడా 2018 నాటికి పూర్తి కావడం సాధ్యం కాదని తేలిపోవడంతో ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై నెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాజెక్టులో జరుగుతున్న అక్రమాలపై ఆధారాలతో సహా ప్రతిపక్షాలు ఎత్తిచూపుతూ, బహిరంగ చర్చకు రావాలని సవాలు చేస్తుంటే ఆత్మ రక్షణలో పడిన ప్రభుత్వం ఎలా సమర్థించుకోవాలో తెలియక ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్నాయని కౌంటర్‌ ఎటాక్‌ చేస్తున్నది.
 
పాఠాలు నేర్చుకోని ‘బాబు’
1995–2004 మధ్య చంద్రబాబు ప్రజల ఆకాంక్షలు, ఆక్రందనలు గుర్తించకుండా, సహచర పార్టీ నేతల సలహాలు, హితవులు పాటించకుండా ప్రపంచ బ్యాంక్‌ ఎజెండాను అమలు చేసుకుంటూ పోయారు. రాష్ట్ర ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు ఎగసి అవి ఉద్యమాలుగా రూపుదిద్దుకుంటే వాటిపట్ల సానుకూల వైఖరితో విధానాలను సమీక్షించుకొని అనుగుణ్యమైన సవరణలు చేసుకోకుండా సాచివేత విధానాలను అమలు చేశారు. విద్యుత్‌ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఎగసిన ఉద్యమంపై బషీర్‌బాగ్‌ సాక్షిగా పోలీసు తూటాలను ప్రయోగించారు. వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్‌ ఇస్తే రాష్ట్రం అంధకారంగా మారుతుందని కరెంట్‌ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందంటూ ప్రభుత్వ నిధులతో పెద్ద ఎత్తున ప్రచారం చేయించారు. తన హయాంలోనే తెలంగాణ అద్భుతమైన అభివృద్ధి సాధించిందంటూ హైదరాబాద్‌లోని సైబ రాబాద్‌ అభివృద్ధిని తన ఖాతాలో చూపించాలని విశ్వ ప్రయత్నం చేశారు. చివరకు అలిపిరిలో తనపై నక్సలైట్లు దాడి చేసినప్పుడు దానిని ప్రభుత్వ వైఫల్యంగా అంగీకరించకుండా ఏకంగా అసెంబ్లీని రద్దు చేసి నక్సలిజానికి వ్యతిరేకంగా ప్రజా తీర్పు అంటూ దానిని ప్రధాన ఎన్నికల అస్త్రంగా మార్చి భంగపడ్డారు. చరిత్ర పునరావృతమైనట్లుగా, సీఎం బాబు ప్రస్తుతం రాష్ట్రంలో ఎగసిపడుతున్న పలు ప్రజా ఉద్యమాలను నిర్దాక్షిణ్యంగా అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. హక్కుల కోసం డిమాండ్‌ చేస్తున్న సంఘాలలో చీలికలు తెస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఉద్యోగ సంఘాలు, టీచర్‌ సంఘాలలో చీలి కలు తెచ్చిన తెలుగుదేశం పార్టీ చివరకు జర్నలిస్ట్‌ సంఘాలలో సైతం పార్టీ పరంగా చీలికలు తేవడం గమనార్హం. తాజాగా, డబ్బుతో అధికార దుర్వినియోగంతో లభించిన నంద్యాల గెలుపును సీఎం చంద్రబాబు తన విధానాలకు, అభివృద్ధి నమూనాకు ప్రజలిచ్చిన తీర్పుగా అభివర్ణించుకుంటూ ప్రజాస్వామ్యానికి ఊపిరి అయిన ప్రజా ఉద్యమాలను మరింతగా అణచివేసే ప్రమాదం కనబడుతున్నది. కౌంటర్‌ ఉద్యమాలవల్ల తాత్కాలిక విజయాలు దక్కవచ్చు. అంతిమంగా ప్రజా చైతన్యం ముందు తలవంచాల్సిందే.
వ్యాసకర్త 
సి. రామచంద్రయ్య, మాజీ ఎంపీ 
మొబైల్‌ : 81069 15555

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement