గవర్నర్‌తో చంద్రబాబు భేటీ
ఓటుకు కోట్లు కేసు, ఏపీకి ప్యాకేజీ అంశాలపై చర్చ!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. సుమారు గంటపాటు వీరిద్దరూ ఏకాంతంగా వివిధ అంశాలపై చర్చించారు. ఇటీవల ముగిసిన ఏపీ శాసనసభ సమావేశాలతో పాటు రాష్ట్రంలోని రాజకీయేతర పరిస్థితులను గవర్నర్‌కు చంద్రబాబు వివరించారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగిందని సమాచారం. అలాగే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించటానికి దారితీసిన పరిస్థితులు, రాష్ట్రంలో ప్రత్యేక హోదా సాధనకు జరుగుతున్న ఆందోళనలు గురించి కూడా గవర్నర్‌కు సీఎం వివరించారని అధికారవర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం గవర్నర్ ఢిల్లీ వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీని కలసి తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితులను వివరించనున్నారు.
చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు
ఈద్-ఉల్-జుహా పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.