'చూశారా... మాదే బలం..' టీడీపీయే బలంగా ఉందని చంద్రబాబు ప్రచారం
'చూశారా... మాదే బలం..' టీడీపీయే బలంగా ఉందని చంద్రబాబు ప్రచారం
Published Thu, Sep 5 2013 3:12 AM | Last Updated on Fri, Aug 10 2018 5:38 PM
రాష్ట్రంలో తెలుగుదేశం పనైపోయిందని ఆ పార్టీ నేతలంతా దిగాలుపడిపోగా... లేదులేదు మనకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పడానికి ఏం చేయాలని తలపట్టుకున్న అధినేతకు మెరుపులాంటి ఒక ఆలోచన తట్టిందట... అదే అవనిగడ్డ. రాష్ట్రంలో ఒక్క టీడీపీయే బలంగా ఉందని చెప్పడానికి అవనిగడ్డ ఫలితం గురించి ప్రచారం చేయమన్నారట చంద్రబాబు.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన టీడీపీ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య అనారోగ్యంతో మృతి చెందటంతో ఉప ఎన్నికలో ఆయన కుమారుడు పోటీచేసి గెలిచిన సంగతి తెలిసిందే. తమ పార్టీ ఎమ్మెల్యే అనారోగ్యంతో మృతి చెందిన కారణంగా ఆ కుటుంబం నుంచే అభ్యర్థిని నిలబెడుతున్నామనీ, ఏక గ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించాలని కోరుతూ చంద్రబాబు స్వయంగా కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా వంటి అన్ని రాజకీయ పార్టీల అధినేతలందరికీ లేఖలు రాశారు. ఆయన విజ్ఞప్తికి అన్ని రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించి పోటీకి దూరంగా ఉన్నాయి. అయితే ఇద్దరు స్వతంత్రులు మాత్రం పోటీకి నిలవడంతో ఎన్నిక అనివార్యమై పోలింగ్ జరగ్గా టీడీపీ అభ్యర్థి 61 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్రలో ఉద్యమం జరుగుతున్న సమయంలో ప్రజలు ఒక్క టీడీపీని మాత్రమే ఆదరిస్తున్నారనడానికి ఇదే ఉదాహరణని ప్రచారం చేయాలని చంద్రబాబు ఆదేశించారట. ఇంకేముంది తెలుగు తమ్ముళ్లు రంగంలోకి దిగారు. రేపటి రోజున రాష్ట్రమంతా ఇవే ఫలితాలొస్తాయని వియ్యంకుడు బాలకృష్ణ తొడగొట్టారు. ఇక ఢిల్లీలో టీడీపీ ఎంపీలు పార్లమెంట్ సెంట్రల్ హాలు, లాబీల్లో కలిసిన జాతీయ పార్టీ నేతలందరికీ ఇదే విషయం చెప్పడం ప్రారంభించారు. విషయం తెలియని కొందరు ఇతర రాష్ట్ర నేతలు ఔరా...!అని ఆశ్చర్యపోయారట.
పార్లమెంట్‌లో విభజన గొడవ జరుగుతున్న సమయంలో రాష్ట్రానికి చెందిన నేతలు కొందరు లాబీల్లో కలిసినప్పుడు... ‘మీరెంత చేసినా ఫలితం లేదు. కొద్ది రోజుల కింద మీ రాష్ట్రంలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఉపఎన్నిక జరిగితే టీడీపీయే గెలిచింది కదా’.. అని ఉత్తర భారత దేశానికి చెందిన సీనియర్ బీజేపీ నేత ఒకరు చెప్పడంతో అక్కడున్న నేతలంతా ఆశ్చర్యపోయారట. ఉపఎన్నికా... అదెక్కడ జరిగింది? అని కాసేపు బుర్ర బద్దలు కొట్టుకుంటే అవనిగడ్డ గుర్తుకొచ్చిందట. అసలక్కడ ఏ పార్టీ పోటీ చేయలేదు కదా... అని ఒక టీడీపీ ఎంపీని ఆరా తీయగా చంద్రబాబు మంత్రాంగం తెలియడంతో అవాక్కయ్యారట. ‘ఔరా.. బాబూ... ప్రచారంలో నీకు నీవే సాటి’ అనుకుని, ఆ ఇద్దరు ఇండిపెండెంట్లను కూడా వాళ్లే నిలబెట్టారేమో... అని సందేహం వ్యక్తం చేశారట.
Advertisement