
ఢిల్లీలో ఆ ఆరు గంటలు...
- ఎవరికీ అందుబాటులో లేని చంద్రబాబు
- రహస్యంగా కొందరు ప్రముఖులతో భేటీ
సాక్షి, న్యూఢిల్లీ/ అమరావతి: అమెరికా పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొన్ని గంటలపాటు ఎవరికీ అందుబాటులో లేకుండా అదృశ్యమయ్యారు. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న చంద్రబాబు బృందం అక్కడి నుంచి నేరుగా విజయవాడ రావాల్సి వుంది. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నట్టుగా 3.15కు ఒకసారి, ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడ వెళుతున్నట్టు 3.55కు ఒకసారి మీడియాకు అధికార వర్గాల ద్వారా సమాచారం అందించారు. కానీ రాత్రి తొమ్మిది గంటల వరకూ సీఎం ఎయిర్‌పోర్టు లాంజ్‌లోనే ఉన్నట్టు ముఖ్యమంత్రి ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది మీడియాను నమ్మించారు.
అయితే ఆయన రహస్యంగా ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ నగరం చేరుకుని కొందరు ప్రముఖులతో భేటీ అయినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాత్రి 8.35 వరకు తన రహస్య మంతనాలు ముగించుకున్న ముఖ్యమంత్రి తిరిగి తొమ్మిది గంటలకు ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. ఢిల్లీలో ఎక్కడికెళ్లారు, ఎవరెవరిని కలిశారనే సమాచారాన్ని గోప్యంగా ఉంచారు. సాయంత్రానికే రాష్ట్రానికి చేరుకుంటారని షెడ్యూలులో ఉన్నా.. దాన్ని పక్కనపెట్టి అత్యవసరంగా, రహస్యంగా మంతనాలు జరపడం ఆసక్తి కలిగించింది. చంద్రబాబు రాత్రి 9.30 గంటల సమయంలో ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరారు. శనివారం విజయవాడ నుంచి నెల్లూరు వెళ్లి మంత్రి నారాయణ, ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు.