
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా రోడ్లమీద, పిచ్చాపాటిగా కాలక్షేపం చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడి రోడ్ల మీద సరదాగా తిరుగుతూ కాలక్షేపం చేశారు. రోడ్డు పక్కన ఉన్న ఓ చిరు దుకాణంలో పాప్‌కార్న్ కొని.. వాటిని తింటూ తిరిగారు. ఆయన వెంట కోమటి జయరాంతోపాటు అతి కొద్దిమంది ఎన్నారైలు ఉన్నారు. చంద్రబాబు వెంట ఉన్నవారిలో ఒకరి చేతిలో పాప్‌కార్న్ ప్యాకెట్ ఉండగా.. మరొకరి చేతిలో వాటర్ బాటిల్ ఉంది. మొక్కజొన్న స్నాక్స్ తింటూ.. పరిసరాలను గమనిస్తూ.. చంద్రబాబు అలా పిచ్చాపాటిగా గడిపారు. ఎప్పుడు అమెరికాకు వెళ్లినా.. బిజిబిజిగా గడిపే చంద్రబాబు గతానికి భిన్నంగా ఈసారి సాదాసీదాగా కాలక్షేపం చేయడం గమనార్హం. గత నెల 30వ తేదీన చంద్రబాబు అమెరికాకు వెళ్లారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం చంద్రబాబు అగ్రరాజ్యానికి వెళ్లారని తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఆయన హైదరాబాద్ చేరుకున్నారు.