
చంద్రబాబు నాయుడు
హైదరాబాద్: అర్ధంపర్ధంలేని, ఆచరణ సాధ్యంకాని పథకాలు ప్రవేశపెట్టి వివరణ కోరిన మంత్రులపై కూడా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరుపారేసుకుంటున్నారని వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన విమర్శించారు. స్వయంసహాయ బృందాలతో జిల్లాలవారీగా ఏర్పాటు చేసిన వీడియో కన్ఫరెన్స్లో జన్మభూమి కార్యక్రమం గురించి వివరణ కోరగా, స్పష్టత ఇవ్వవలసిన సిఎం వారి మైకులు కట్ చేశారన్నారు. ఎక్కువ మాట్లాడుతున్నారంటూ ఒక దళిత మంత్రిపై చంద్రబాబు నోరుపారేసుకున్నట్లు తెలిసిందన్నారు.
చంద్రబాబు వ్యవహార శైలి చేతగాని వారికి కోపం ఎక్కువ అన్నట్లుగా ఉందన్నారు. మంత్రులకే అర్ధంకాని విధంగా ఆయన పథకాలను రూపొందించారని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తే, ప్రజలపై దాడి చేస్తున్నారన్నారు. మంత్రులు ప్రశ్నిస్తే, ఇప్పుడు వారిపై కూడా దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలలో ప్రతిపక్షం మీద అవాకులు చవాకులు విసిరిన చంద్రబాబు ఇప్పుడు అదే విద్యను స్వయంగా మంత్రుల మీద ప్రదర్శిస్తున్నారన్నారు. చంద్రబాబును మించిన నియంత ప్రపంచంలో మరెవరూ లేరని చెప్పకనే చెప్పినట్లు ఉందన్నారు. చంద్రబాబు అనుసరించే అప్రజాస్వామిక ధోరణులపై ప్రజాస్వామికవాదులు అందరూ తిరగబడాలని కల్పన పిలుపు ఇచ్చారు.
**