విలువలకు పాతర | Is this Democracy: Defected MLA's took oath as Ministers | Sakshi
Sakshi News home page

విలువలకు పాతర

Published Tue, Apr 4 2017 12:19 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

విలువలకు పాతర - Sakshi

విలువలకు పాతర

అవకాశం దొరికొతే చాలు... నీతిబద్ధ రాజకీయాలకు నిలువెత్తు నిఘంటువునని స్వోత్కర్షకు పోయే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు గడ్డకు మచ్చ తెచ్చారు. ఫిరాయింపుదార్లకు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించి పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలకు పాతరేశారు. తాను అధోగతికి దిగజారుతూ రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన గవర్నర్‌ నరసింహన్‌ను సైతం ఆ రొంపిలోకి లాగి ఆయనకూ మకిలంటేలా చేశారు. ‘అల్పబుద్ధివానికధికారమిచ్చిన...’ అంటూ ఏనాడో వేమన్న చేసిన హెచ్చరిక నూటికి నూరూపాళ్లూ నిజమని నిరూపించారు. ఆదివారం వెలగపూడి సచివాలయ ప్రాంగణంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించిన తీరు చూసి తెలుగు ప్రజానీకం విస్తుపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో సైతం ఏనాడూ కనీవినీ ఎరుగని సన్నివేశమిది. 
 
పొరుగునున్న తెలంగాణలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నప్పుడు ఇదే చంద్రబాబు ఎంత ఆవేశపడిపోయారో, ఎలాంటి నీతులు వల్లించారో ఎవరూ మరి చిపోలేదు. ఫిరాయింపుల్ని రాజకీయ వ్యభిచారంగా ఆయన అభివర్ణించారు. అది రాజ్యాంగ ఉల్లంఘనంటూ నిప్పులు చెరిగారు. ప్రమాణస్వీకారం చేయించేముందు తలసాని ఏ పార్టీ ఎమ్మెల్యేనో తెలుసుకోవాల్సిన అవసరం లేదా అంటూ గవర్నర్‌ను నిలదీశారు. అయితే కనీసం తలసాని శ్రీనివాస యాదవ్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా పత్రం సమర్పించారు. ఇప్పుడు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన నలుగురూ ఆ పనైనా చేయలేదు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సోమవారం గవర్నర్‌ను కలిసి బాబు తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేసి, ఇలాంటి అవాంఛనీయ ధోరణులకు చోటివ్వరాదని కోరారు. ఇదే విషయంపై రాష్ట్రపతిని, అవకాశం వస్తే ప్రధానిని కూడా కలుస్తామన్నారు. 
 
ఈ లోగా మంత్రులైన నలుగురూ స్పీకర్‌కు రాజీనామా పత్రాలిచ్చారంటూ ఏపీ సర్కారు కొత్త వదంతిని ప్రచారంలో పెట్టింది. కాసేపు అది నిజమే అనుకున్నా... అందుమూలంగా చంద్రబాబు చేసిన పాపమేమీ చెరిగిపోదు. ప్రజాస్వామ్య విలువలపై ఏమాత్రం విశ్వాసం ఉన్నా ఆ 21 మందీ తన పార్టీలోకి వచ్చినప్పుడే వారితో బాబు రాజీనామా చేయించి ఉండాలి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ స్థాపించాక వచ్చిన 17మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆ పనే చేయించారు. వారంతా రాజీనామాలు సమర్పించి ఆమో దింపజేసుకుని ఉప ఎన్నికల బరిలో దిగి గెలిచారు. అందుకు భిన్నంగా మంత్రులైన నలుగురూ స్పీకర్‌కు రాజీనామా సమర్పించారనడం ఎవరిని వంచించడానికి?
 
ఈ వ్యవహారంలో గవర్నర్‌ పాత్ర కూడా చర్చనీయాంశమైంది. ఆ పదవికి ఎంపికయ్యేవారు రాజకీయాలకు సంబంధం లేనివారైతే నిష్పక్షపాతంగా ఉంటారని  కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై నియమించిన సర్కారియా కమిషన్‌ చాలా కాలం క్రితం చెప్పింది. నరసింహన్‌ పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసి రిటైరైన వ్యక్తి. రాజ కీయాలకు అతీతుడు. రాజ్యాంగం గురించీ, పాలనా వ్యవహారాల గురించీ ఆయనకు ఎవరూ చెప్పాల్సిన పనిలేదు. ఆ పదవిలో అనుభవమూ గడించారు. కానీ తాను ప్రమాణస్వీకారం చేయిస్తున్న వ్యక్తుల నేపథ్యమేమిటో తెలుసు కోవాల్సిన బాధ్యత తనపై ఉన్నదన్న సంగతిని మరిచారు. రాష్ట్రానికి గవర్నర్‌ ఒకరున్నారని తెలిసే సందర్భాలు అరుదుగా వస్తాయి.
 
సాధారణంగా కొత్తగా ప్రభుత్వాలు ఏర్పాటైనప్పుడూ, ఉన్న ప్రభుత్వాలు మైనారిటీలో పడినప్పుడూ వారి పాత్ర సర్వత్రా చర్చకొస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌ది విచిత్రమైన స్థితి. ఫిరా యింపుదారులను చంద్రబాబు మంత్రులుగా తీసుకోవడంతో గవర్నర్‌ పాత్ర కీలకంగా మారింది. వారు శాసనసభ్యులుగా కొనసాగడమే చట్టవిరుద్ధంకాగా, మంత్రి పదవులిచ్చి అందలం ఎక్కించడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని నరసింహన్‌ స్పష్టం చేసి ఉంటే ఆయన తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి నట్టయ్యేది. ఫిరాయింపులు సరికాదని, ఆ బాపతువారికి పదవులివ్వడాన్ని తాను అనుమతించబోనని చెప్పకపోతే నరసింహన్‌లాంటివారు ఆ పదవిలో కొనసాగి ప్రయోజనమేమిటి?
 
ఇలాంటి సమయాల్లో తనను తాను ఉన్నత విలువలకు ప్రతీకగా చెప్పుకోవడం బీజేపీకి అలవాటైంది. ఒక పార్టీ నుంచి గెలిచినవారు తమ పదవుల్ని వదు లుకోకుండానే మరో పార్టీలోకి వెళ్లడంపై ప్రజల్లో చర్చ జరగాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెబుతున్నారు. తాను లోగడ కూడా ఇలాగే చెప్పానం టున్నారు. ఆ సంగతేమోగానీ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఈ నీతిమాలిన ధోరణులను నియంత్రించడానికి తన వంతుగా ఏం చేయాలో వెంకయ్య ఆలోచించారా? స్పీకర్లు అధికార పక్షం చెప్పినట్టల్లా తలాడిస్తూ ఫిరా యింపుల నిరోధ చట్టం స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారని వెల్లడవుతుంటే కర్తవ్యమేమిటో గుర్తించారా? ఊకదంపుడు మాటలవల్ల ఒరిగేది శూన్యం. 
 
ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు స్పందన మరింత చిత్రమైనది. రాజకీయాల్లో ఎలాంటి నైతిక విలువలు పాటించాలన్నది ఆయా రాజకీయ పార్టీల ఇష్టమని ఆయన చెబుతున్నారు. నిజమే...అది పార్టీల ఇష్టమే కావొచ్చు. కానీ అలాంటి పార్టీలతో అంటకాగుతున్న తమ నైతికత ఏపాటి? ఎన్నికైన కొద్ది రోజులకే పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ లోక్‌సభ స్పీకర్‌కు చేసిన ఫిర్యాదు మూడేళ్లయినా అతీగతీ లేకపోవడంలోని మతలబేమిటి? వెంకయ్య, హరిబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒకసారి అధికారం చేతికందాక ఏం చేసినా తమకు అడ్డూ ఆపూ ఉండదని, ఎవరూ అడిగేవారుండరని చంద్రబాబు అనుకుంటే అనుకోవచ్చు. కానీ ఇలాంటి పాపాలు అంత సులభంగా చెరిగిపోవు. సమయం ఆసన్నమైనప్పుడు శాపాల్లా వెంటాడి కాటేస్తాయి. పార్టీ విధేయతనూ, జనం తీర్పునూ సంతలో సరుకు చేసి ఖరీదు కట్టి అధికారం శాశ్వతం చేసుకోవాలనుకునే చంద్రబాబులాంటివారు చివరకు బుట్టదాఖలా కావడం ఖాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement