హామీల జల్లు | Chandrababu Naidu assurances of our district | Sakshi
Sakshi News home page

హామీల జల్లు

Published Fri, Aug 21 2015 2:25 AM | Last Updated on Thu, Jul 11 2019 5:07 PM

హామీల జల్లు - Sakshi

హామీల జల్లు

- ఎడ్యుకేషన్ సిటీగా తాడేపల్లిగూడెం
- భీమవరంలో ఆక్వా యూనివర్సిటీ
- నరసాపురంలో పోర్టు అభివృద్ధికి చర్యలు
- నిట్ భవనాల శంకుస్థాపన సభలో చంద్రబాబు
తాడేపల్లిగూడెం :
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన జిల్లాపై హామీల జల్లు కురిపించారు. తాడేపల్లిగూడెం పట్టణాన్ని ఎడ్యుకేషన్ సిటీగా మారుస్తామని.. భీమవరంలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని.. నరసాపురం పట్టణంలో పోర్టును అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. తాడేపల్లిగూడెంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) శాశ్వత భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన విమానాశ్రయం రన్ వే వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని, దశాబ్దాలుగా విమానాశ్రయ భూముల్లో నివాసం  ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి, శాశ్వత గృహాలు నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

ఇక్కడే 50 ఎకరాలలో టౌన్‌షిప్ ఏర్పాటు చేసి ఆదర్శకాలనీగా తీర్చిదిద్దుతామన్నారు. మరో 50 ఎకరాలలో ఆటోనగర్ ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రెయినేజీ వ్యవస్థను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు సహకారంతో ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఏలూరు సమీపంలోని వట్లూరులో నిట్ కోసం సిద్ధం చేసిన 250 ఎకరాల భూమిని అభివృద్ధి చేస్తామని, అక్కడ అవసరమైతే మరో 150 ఎకరాలు సేకరించి 400 ఎకరాల భూమిలో ఏదో ఒక ప్రముఖ సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో 16 వేల ఎకరాల అటవీ భూములను పారిశ్రామిక అభివృద్ధికి వినియోగించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వివరించారు.

కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నిట్ నుంచి అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులు బయటకు రావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలోనే రికార్డు స్థాయిలో 480 సీట్లతో ఇక్కడి నిట్ ప్రారంభమైందన్నారు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ పరి ధిలో ఏడు జాతీయ విద్యాసంస్థలు రాష్ట్రంలో ఏర్పాటు కావడం అదృష్టమన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ రవాణా రంగంలో విజయవాడ తర్వాత తాడేపల్లిగూడెం పేరు సాధించిందన్నారు.

ఇక్కడ ఆటోనగర్ ఏర్పా టు చేయాలని కోరారు. విజ్జేశ్వరం నుంచి తాడేపల్లిగూడెంకు పైపులైన్ ద్వారా తాగునీరు అందించే పథకాన్ని నిర్మించాలని, తాడేపల్లిగూడెంను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దడానికి సహకరించాలని కోరారు. అటవీ భూములను డీనోటిఫై చేసి వెంకట్రామన్నగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మించాలని కోరారు. నిట్ తాత్కాలిక తరగతుల కోసం భవనాలు సమకూర్చిన వాసవీ ఇంజి నీరింగ్ కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖమంత్రి పీతల సుజాత మాట్లాడుతూ జిల్లాను పసుపుమయం చేసి, 15 స్థానాలను అందించిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
 
నిట్‌కు రూ.300 కోట్లు

తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేస్తున్న ఏపీ నిట్ కోసం రూ.300 కోట్లను కేటాయిస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. నిట్‌లో చదివిన వారంతా వ్యవసాయ రంగం అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. విమానాశ్రయ రన్ వే సమీపంలో ఏర్పాటు చేసిన నిట్ పైలాన్‌ను సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు ఎం. వెంకయ్యనాయుడు, స్మృతి ఇరానీ, సుజనా చౌదరి ఆవిష్కరించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రు లు చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీలు సీఎం రమేష్, గోకరాజు గంగరాజు, మాగంటి బాబు, తోట సీతారామలక్ష్మి, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్,  జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, కంతేటి సత్యనారాయణరాజు బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ,
ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, ఆరిమిల్లి రాధాకృష్ణ, నిమ్మల రామానాయుడు, బూరుగుపల్లి శేషారావు, కేఎస్ జవహర్, తాడేపల్లిగూడెం మునిసిపల్ చైర్మన్ బొలిశె ట్టి శ్రీనివాస్, వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ బి.ఉదయలక్ష్మి,  జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్,  నిట్ ఏపీ రెసిడెంట్ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ టి.రమేష్, వరంగల్ నిట్ మెంబర్ డెరైక్టర్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసరావు, వాసవీ ఇంజినీరింగ్ కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు గ్రంధి సత్యనారాయణ, చలంచర్ల సుబ్బారావు, మహిళామోర్చా నాయకురాలు శరణాల మాలతీ రాణి, మాజీ ఎమ్మెల్యేలు ఈలి నాని, పసల కనకసుందరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement