సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లా టీడీపీలో ధిక్కార స్వరాలు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో అధినేత చంద్రబాబునాయుడి వైఖరిపై కొందరు నాయకులు భగభగ మండుతున్నారు. ఇతర పార్టీల నుంచి కొందరు నేతలు టీడీపీలోకి వస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న నేతలు అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. హైదరాబాద్‌లో ఏసీ రూముల్లో కూర్చుని సీట్లు ఖరారు చేస్తే ఒప్పుకునేది లేదని, తమని కాదంటే పార్టీకి డిపాజిట్లు కూడా రానివ్వమని హెచ్చరిస్తున్నారు. బుధవారం తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం అసంతృప్తి నేతలకు వేదికగా మారింది. ఈ నెల 18న తాడేపల్లిగూడెంలో ప్రజాగర్జనకు జనసమీకరణ ఎలా చేయాలనే దానిపై నిర్వహించిన సమావేశంలో సభ నిర్వహణపై పెద్దగా చర్చ జరగలేదు. పలు నియోజకవర్గాల్లో తమకు అన్యాయం జరుగుతుంద నే నాయకుల ఆవేదనలు, ఆగ్రహావేశాలు, హెచ్చరికలే సమావేశంలో చోటుచేసుకున్నా యి. పలువురు నేతలు అధినేత చంద్రబాబు వైఖరిని సైతం ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, ఆచంట, చింతలపూడి తదితర నియోజకవర్గాల నేతలు అధిష్టానం తీరుపై భగ్గుమన్నారు.
తాడేపల్లిగూడెం సీటు ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈలి నాని లేదా మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు ఇచ్చేస్తున్నారనే ప్రచారంపై ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముళ్లపూడి బాపిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మొదటి నుంచి ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా పార్టీ జిల్లా సమావేశంలో పరిశీలకుడు గరికపాటి రామ్మోహనరావు సమక్షంలో అధిష్టానంపై ఆయన విరుచుకుపడడం చర్చనీయాంశమైంది. అధిష్టానం ఎవరికి సీటిస్తే వారి విజయానికి పనిచేయడానికి తాము సిద్ధంగా లేమని, ఈ విషయాన్ని అగ్రనేతలు గుర్తించాలని ఆయన హెచ్చరించారు. ఉంగుటూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గన్ని వీరాంజనేయులు అనుయాయులు కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి వెళ్లగక్కారు. సామాజిక సమీకరణలు, సర్దుబాట్ల పేరుతో మొదటి నుంచి పనిచేసిన వారికి అన్యాయం జరిగితే సహించేది లేదని తేల్చిచెప్పారు. ఈలి నాని, కొట్టు సత్యనారాయణలో ఎవరో ఒకరు ఉంగుటూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో గన్ని వీరాంజనేయులు వర్గం ఆందోళన చెందుతోంది.
ఈ సమావేశంలో అది బహిర్గతమైంది.
ఆచంట నియోజకవర్గంలో గొడవర్తి శ్రీరామ్‌కు సీటివ్వకుండా బయట వ్యక్తుల్లో ఎవరికి సీటిచ్చినా పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని ఒక నేత స్పష్టం చేయడం అందరినీ నెవ్వెరపరిచింది. ఐదేళ్లపాటు నియోజకవర్గంలో కష్టపడి పనిచేశామని, ఇప్పుడు ఎవరెవరో వచ్చి హడావుడి చేస్తున్నారనే ఆందోళన చాలా నియోజకవర్గాల నేతల్లో వ్యక్తమైంది. చింతలపూడి, ఏలూరు నియోజకవర్గాల నేతలు కూడా అసంతృప్తిని వెలిబుచ్చారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వలస పక్షులను ఎదుర్కోవాలంటూ చేసిన వ్యాఖ్య సమావేశానికి వచ్చిన నేతలందరినీ ఆశ్చర్యపరిచింది. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆయన అలా అనడంతో ఇతర నేతలు ఉలిక్కిపడ్డారు. మొత్తంగా పార్టీని పటిష్టం చేసే పేరుతో ఇతరులకు ఆహ్వానం పలికి సీట్లిచ్చే వ్యవహారం తెలుగుదేశం పార్టీలో పెద్ద అగాథాన్నే సృష్టించబోతున్నట్టు ఈ పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. మున్ముందు ఈ నేతలంతా ఇంకా బహిరంగంగా అధిష్టానంపై విరుచుకుపడే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరు నేతలైతే పార్టీని వీడి బయటకు వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
బాబు వైఖరిపై భగభగ
Published Thu, Jan 9 2014 4:29 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM
Advertisement